– మోడల్ అంగన్వాడి కేంద్రం నిర్మాణానికి ముందుకొచ్చిన రామ్ చరణ్, ఉపాసన దంపతులు
– రూ. 2 కోట్ల ఆధ్యాత్మిక వసతులతో అంగన్వాడి కేంద్రం నిర్మాణం
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో :-
పిఠాపురం నియోజకవర్గం పై మెగా కుటుంబం మరోసారి తమ అభిమానాన్ని చాటుకుంది. పిఠాపురంలో రామ్ చరణ్,ఉపాసన దంపతులు సామాజిక సేవా ప్రాజెక్టును చేపట్టనున్నారు. సామాజిక సేవారంగంలో మరో అడుగు ముందుకు వేశారు. పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో చిన్నారుల ఆరోగ్యం, విద్య, పోషణను దృష్టిలో ఉంచుకొని.. అపోలో హాస్పిటల్స్ సహకారంతో ఒక మోడల్ ప్రాజెక్టు రూపు దిద్దుకుంటోంది. సుమారు రెండు కోట్ల భారీవ్యయంతో అత్యుత్తమ మౌలిక వసతులతో ఈ ప్రాజెక్టు అందుబాటులోకి రానుంది. గతంలో కూడా మెగా కుటుంబం పిఠాపురం నియోజకవర్గంలో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టింది. కానీ ఇప్పుడు రామ్ చరణ్, ఉపాసన దంపతులు చేపడుతున్న ఈ ప్రాజెక్టు అతి పెద్దది.
కార్పొరేట్ స్థాయి వసతులతో..
గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారులకు కార్పొరేట్ స్థాయి వసతులు అందించాలనే ఉద్దేశంతో ఈ మోడల్ అంగన్వాడీ కేంద్రాన్ని తీర్చిదిద్దారు. పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించడం, మెరుగైన వైద్య సంరక్షణ అందించడం, డిజిటల్ హెల్త్ రికార్డుల నిర్వహణ, పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించడం వంటి ఆధునిక హక్కులతో దీనిని నిర్మించారు. అపోలో హాస్పిటల్స్ భాగస్వామ్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు మహిళలు, శిశువుల సర్వతోముకాభివృద్ధికి ఒక సరికొత్త బెంచ్ మార్క్ గా నిలవనుంది.
త్వరలో పవన్ చేతుల మీదుగా ప్రారంభం..
పిఠాపురం నియోజకవర్గంలో అత్యాధునికంగా నిర్మించిన ఈ అంగన్వాడి కేంద్రాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రారంభించనున్నారు. నియోజకవర్గంలోని చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాది పడుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురంలో విజయవంతంగా రూపుదిద్దుకున్న ఈ మోడల్ అంగన్వాడి కేంద్రం ప్రాజెక్టు భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అట్టడుగు స్థాయి వర్గాల అభ్యున్నతికి.. ఈ తరహా సామాజిక కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అంచనాలు ఉన్నాయి. రామ్ చరణ్, ఉపాసనలను స్ఫూర్తిగా తీసుకొని మరి కొంతమంది సామాజిక సేవా కార్యక్రమాల్లో అడుగు పెట్టే అవకాశం ఉంది.
