క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- వరంగల్ విమానాశ్రయానికి పేరు పెట్టే వ్యవహారంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలకు తావిస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే వరంగల్ ఎయిర్‌పోర్టుకు అవసరమైన అన్ని అనుమతులను మంజూరు చేసిందని ఆయన స్పష్టం చేశారు.
విమానాశ్రయానికి పేరు నిర్ణయించే విషయంలో స్థానిక చరిత్ర మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని బండి సంజయ్ సూచించారు. చారిత్రాత్మక వరంగల్ నేల వైభవాన్ని ప్రతిబింబించేలా “కాకతీయ”, వీరనారి “రాణి రుద్రమదేవి”, లేదా ప్రజల ఆరాధ్య దైవాలైన “సమ్మక్క-సారక్క” వంటి పేర్లలో దేనిని ఖరారు చేసినా తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. తెలంగాణ ప్రజల సెంటిమెంట్‌ను గౌరవిస్తూ స్థానిక మహానీయులు లేదా దేవతల పేర్లు పెట్టడం సముచితంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు: ఎన్డీఏ కూటమిలో సీట్ల పంపకాలపై ఉత్కంఠ – జనసేన వాటా ఎంత?
అయితే, రేవంత్ రెడ్డి తన ముఖ్యమంత్రి పీఠాన్ని కాపాడుకోవడానికి, ఢిల్లీ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. సీఎం సీటును కాపాడుకునే క్రమంలో డూప్లికేట్ గాంధీ కుటుంబం పేరును వరంగల్ ఎయిర్‌పోర్ట్‌కు పెట్టాలని చూస్తే మాత్రం అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. గాంధీ కుటుంబం పేరును ప్ర ప్రతిపాదిస్తే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామని, ప్రజల తరఫున పెద్ద ఎత్తున తిరగబడతామని హెచ్చరించారు.స్థానిక ప్రాముఖ్యతను విస్మరించి రాజకీయ ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని బండి సంజయ్ తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో వరంగల్ ఎయిర్‌పోర్టు నామకరణంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందనేది తీవ్ర ఉత్కంఠకు దారితీస్తోంది.
