-సమాజానికి తప్పుడు సంకేతాలు
-అధికార, ప్రతిపక్షం బాధ్యతారాహిత్యం
-మూఢ నమ్మకాలు ప్రమాదకరం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో :- పూజలు, క్షుద్ర పూజల చుట్టూ తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నాయి. సాధారణంగా ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాల అమలు, నిరుద్యోగం, అభివృద్ధి అజెండా చుట్టూ రాజకీయాలు తిరగాలి. కానీ తెలంగాణలో అందుకు విరుద్ధమైన పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మాజీ మంత్రి హరీష్ రావు పై ఆరోపణలు చేశారు. తమిళనాడులోని తిరుచ్చి, కర్ణాటకలోని శివమొగ్గ ప్రాంతాలకు వెళ్లి తెలంగాణలో వర్షాలు పడకూడదని.. కరువు రావాలని.. ప్రభుత్వం పడిపోవాలని క్షుద్ర పూజలు చేశారని సంచలన ఆరోపణలు చేశారు. దీనికి తమ వద్ద పక్కా ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చారు. అయితే ఒక్క టీపీసీసీ ప్రెసిడెంట్ మాత్రమే కాదు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులంతా ఇప్పుడు అదే వ్యాఖ్యలు చేస్తుండడం హాట్ టాపిక్ అవుతుంది.
స్పందన కూడా అలానే…
సాధారణంగా ఇటువంటి ఆరోపణలను చాలామంది కొట్టి పారేస్తారు. ఇలాంటి ఆరోపణలు చేయడం ఏంటని చాలా తేలిగ్గా తీసుకుంటారు. కానీ ప్రతిపక్ష బిఆర్ఎస్ స్పందన అంతకంటే విచిత్రంగా ఉంది. పుచ్చకాయలు దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు గా ఉంది. భారత రాష్ట్ర సమితి నేత దాసోజు శ్రవణ్ మీడియా ముందుకు వచ్చారు. హరీష్ రావు కొల్లూరు మూకాంబికా దేవి ఆలయానికి వెళ్లి పవిత్రమైన పూజలు మాత్రమే చేశారని వాదించారు. అంతటితో ఆగకుండా సీఎం రేవంత్ రెడ్డి కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తంకుమార్ రెడ్డిల ప్రాబల్యాన్ని తగ్గించేందుకు క్షుద్ర పూజలు చేస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.
మంచి పద్ధతి కాదు..
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఈ పూజలు, క్షుద్ర పూజల చుట్టూ రాజకీయాలు తిరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రజాక్షేత్రంలో గెలుపు అనేది ప్రజామోదంతో లభిస్తుంది కానీ.. క్షుద్ర పూజలతో కాదు అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అదే జరిగితే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టే బదులు క్షుద్ర పూజలతో ఎక్కువ మంది గెలుస్తారు కదా. ఖరీదైన హోమాల వల్ల రాజకీయ గెలుపులు కానీ.. ప్రభుత్వాల పట్టణాలు కానీ సాధ్యపడవు. ఒకవేళ పూజల వల్లే అధికారాలు వస్తాయనుకుంటే.. గతంలో కెసిఆర్ నిర్వహించిన అఖండ చండీయాగాలు, రాజశ్యామల యాగాల తర్వాత భారత రాష్ట్ర సమితి మళ్లీ అధికారంలోకి వచ్చి ఉండాలి కదా. ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా తీర్పు ఇచ్చి కెసిఆర్ ను ఓడించారు. పూజలు చేసినప్పుడు గెలిచారంటే.. అంతకంటే ఎక్కువ క్రతువులు చేసినప్పుడు ఓడిపోయారని నిజానికి కేసిఆర్ స్వయంగా సాక్ష్యం. పూజల వల్ల మంచి జరుగుతుందని భావించినప్పుడే సైక్లాజికల్ గా క్షుద్ర పూజల వల్ల చెడు జరుగుతుందని భయపడతారు. ఇదంతా కేవలం మనుషుల అంధకార మానసిక భావన తప్ప శాస్త్రీయంగా ఎంత మాత్రం నిజం కాదు.
ప్రజల్లోకి వెళ్లే ఛాన్స్..
ఒకటి మాత్రం నిజం. తెలంగాణ రాజకీయాల్లో అధికార విపక్ష మధ్య సాగుతున్న క్షుద్ర యుద్ధం ఎంత మాత్రం సహేతుకం కాదు. ప్రజలకు వీరు ఏం సంకేతాలు ఇస్తున్నట్టు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ చేతబడులు, మూఢనమ్మకాలతో అమాయకులపై దాడులు జరుగుతున్నాయి. ప్రాణాలు తీసుకోవడం వంటి ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. శాస్త్రీయ దృక్పథాన్ని పెంచాల్సిన నాయకులే స్వయంగా ఆయన క్షుద్ర పూజలు చేశారు.. ఈయన మంత్రాలు చేయించారు అని వాదించుకుంటే ప్రజలు కూడా క్రమంగా ఈ మూఢ నమ్మకాలు కూపంలోకి జారుకుంటారు. అందుకే అధికార, ప్రతిపక్షం బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ముందుగా ప్రజా సమస్యలపై చర్చించాలి. క్షుద్ర పూజల పేరుతో బురద జల్లుకోవడం ఆపి.. ప్రజాస్వామ్య బద్ధమైన పాలన, అభివృద్ధిపై దృష్టి సారిస్తే తెలంగాణ సమాజానికి శ్రేయస్కరం.
