క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ‘ఇందిరా మహిళా శక్తి’ పథకం ద్వారా మహిళా సాధికారత కోసం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 1000 మంది మహిళలను బస్సు యజమానులుగా మార్చడం మరియు ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా క్యాంటీన్లను ఏర్పాటు చేయడం ప్రధాన లక్షంగా పెట్టుకున్నారు.
మహిళలు బస్సు యజమానులుగా…
ఆర్టీసీ (TGSRTC)లో ప్రవేశపెట్టబోయే 1000 అద్దె బస్సులకు మహిళా స్వయం సహాయక సంఘాల (SHGs) సభ్యులను యజమానులుగా చేస్తారు. ఇప్పటికే తొలి విడతలో దాదాపు 150 బస్సులను మహిళా సంఘాలు కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకు ఇచ్చే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ బస్సుల ద్వారా వచ్చే అద్దె ఆదాయం (నెలకు సుమారు ₹70,000 వరకు) నేరుగా మహిళా సంఘాలకు అందుతుంది, తద్వారా వారు ఆర్థిక స్వాలంబన సాధిస్తారు.
‘ఇందిరా మహిళా శక్తి’ క్యాంటీన్లు…
ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు, కలెక్టరేట్లు, పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు, మరియు బస్ స్టాండ్లలో ఈ క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.రానున్న రెండేళ్లలో కనీసం 150 క్యాంటీన్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ క్యాంటీన్ల బాధ్యతను మహిళా స్వయం సహాయక సంఘాలకే అప్పగిస్తారు. ఇప్పటికే హైదరాబాద్‌లోని GHMC ప్రధాన కార్యాలయంలో మరియు కొన్ని కలెక్టరేట్లలో ఇవి విజయవంతంగా నడుస్తున్నాయి. క్యాంటీన్లను సమర్థవంతంగా నడపడానికి ప్రభుత్వం మహిళా సంఘాలకు ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తుంది.