తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలో ఆశ్చర్యానికి గురిచేసే ఘటన వెలుగులోకి వచ్చింది. ఉపాధి హామీ పథకంలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించే రుక్మిణి అనే మహిళకు కమర్షియల్ టాక్స్ శాఖ నుంచి అనూహ్య నోటీసులు రావడంతో ఆమె తీవ్ర ఆందోళనకు గురయ్యింది.
అధికారుల ప్రకారం, “ఆర్ఎం ట్రేడర్స్” పేరుతో నడుస్తున్న ఒక వ్యాపార సంస్థ ద్వారా సుమారు రూ.2.75 కోట్లకు పైగా జీఎస్టీ పన్ను ఎగవేసినట్లు గుర్తించినట్లు తెలిపారు. ఈ కేసులో రుక్మిణి పేరు నమోదై ఉండటంతో ఆమెకు నోటీసులు జారీ చేయడమే కాకుండా, ఆమె బ్యాంక్ ఖాతాను కూడా తాత్కాలికంగా ఫ్రీజ్ చేశారు.
ఇది తెలుసుకున్న రుక్మిణి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఎప్పుడూ ఎలాంటి వ్యాపారం చేయలేదని, రోజువారీ కూలీ పనుల ద్వారానే జీవనం కొనసాగిస్తున్నానని తెలిపింది. తన పేరును ఎవరైనా దుర్వినియోగం చేసి ఈ మోసానికి పాల్పడి ఉండవచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేసింది.
ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పేద మహిళ పేరు మీద ఇంత పెద్ద మొత్తంలో వ్యాపారం ఎలా నమోదైంది? సంబంధిత ధృవపత్రాలు ఎలా పొందారు? అనే అంశాలపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇక అధికారులు ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. నిజమైన నిందితులను గుర్తించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, రుక్మిణి తనపై వచ్చిన ఆరోపణల నుంచి విముక్తి కల్పించాలని అధికారులను వేడుకుంటోంది.
also read: పేపర్ లీకేజీలపై కఠిన చర్యలు: 10 ఏళ్ల జైలు, రూ. 10 కోట్ల జరిమానా – కొత్త బిల్లు కీలక నిర్ణయాలు
