Homeక్రైమ్ప్రియుడితో అక్రమ బంధం.. భర్తను అంతమొందించిన భార్య

ప్రియుడితో అక్రమ బంధం.. భర్తను అంతమొందించిన భార్య

క్రైమ్ మిర్రర్ : నాగర్‌కర్నూల్ పట్టణంలోని రాంనగర్ కాలనీలో ఈ నెల 10న చోటుచేసుకున్న హోటల్ వ్యాపారి మహ్మద్ కరీం (43) హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం, ఆస్తిపై ఆశతోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. కేసులో మృతుడి భార్య సలీమా బేగం (36), ఆమెతో వివాహేతర సంబంధం ఉన్న గౌస్ పాషా (29)ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు కేసు వివరాలను వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం.. సలీమా బేగంకు రేవల్లి మండలం నాగపూర్‌కు చెందిన టైర్ పంక్చర్ షాపు నిర్వాహకుడు, వరుసకు మరిది అయిన గౌస్ పాషాతో సుమారు రెండేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది.

ఈ విషయం భర్త కరీంకు తెలియడంతో భార్యను మందలించాడు. దీంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ వ్యవహారంపై పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా జరగగా, అక్కడ గౌస్‌ను కరీం తీవ్రంగా మందలించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో కరీంపై గౌస్ పగ పెంచుకున్నాడు. మరోవైపు కరీంకు చెందిన కొంత ఆస్తిని కొంతకాలం క్రితమే సలీమా తన పేరుపైకి మార్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు. కరీంను హత్య చేస్తే ఆస్తి తమకే దక్కుతుందని భావించిన సలీమా, గౌస్ కలిసి హత్యకు పథకం రచించినట్లు డీఎస్పీ తెలిపారు.

పథకం ప్రకారం ఈ నెల 7న సలీమా నెల్లూరు దర్గాకు వెళ్లింది. అక్కడి నుంచి గౌస్‌కు వాట్సాప్ కాల్ చేసి అదే రోజు తన భర్తను హత్య చేయాలని సూచించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 2.30 గంటల సమయంలో కత్తి, గ్లౌజులు తీసుకుని గౌస్ కరీం ఇంటికి చేరుకున్నాడు. తలుపు తట్టడంతో నిద్రమత్తులో ఉన్న కరీం తలుపు తీయగా, గౌస్ పదునైన కత్తితో అతడి గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం హత్యకు ఉపయోగించిన కత్తితో పాటు దుస్తులు, చెప్పులను మార్గమధ్యంలో పొదల్లో పడేసి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు వెల్లడించారు.

కరీం సోదరుడు హుస్సేన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా తొలుత మృతుడి భార్య సలీమాను అదుపులోకి తీసుకుని విచారించగా హత్య వెనుక అసలు విషయం వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. దీంతో సలీమా బేగంతో పాటు ఆమె ప్రియుడు గౌస్ పాషాను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఇద్దరినీ కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు.
also read :కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు