క్రైమ్ మిర్రర్ ; వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో పుణెలో పది రోజుల పాటు మద్యం అమ్మకాలు, వినియోగంపై నిషేధం విధించడాన్ని బాంబే హైకోర్టు తీవ్రంగా ప్రశ్నించింది. పండుగ సందర్భంగా శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని నిషేధం విధించినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ, కేవలం పుణె నగరానికే ఇంతకాలం మద్యం నిషేధం విధించడంలో ఉన్న కారణమేంటని న్యాయస్థానం నిలదీసింది. మద్యానికి అలవాటు పడిన వారు ఒక్కసారిగా పది రోజుల పాటు మద్యం దొరకకపోతే ఆరోగ్య సమస్యలు తలెత్తి ఆసుపత్రులకు వెళ్లే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఈ అంశంపై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి ఎంపీ త్రిపాఠి, న్యాయమూర్తి అద్వైత్ సేథ్నాలతో కూడిన ధర్మాసనం అధికారుల నిర్ణయంపై ప్రశ్నలు సంధించింది. మద్యం సేవించిన వ్యక్తి వల్ల శాంతిభద్రతలకు ఇబ్బంది కలిగితే, అతడు మద్యం సేవించాడా లేదా అన్నది సంబంధం లేకుండా చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది.
హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో పుణె పాలనా యంత్రాంగం తన నిర్ణయాన్ని సవరించింది. పది రోజుల పాటు అమలు చేయాలనుకున్న మద్య నిషేధాన్ని రెండు రోజులకు పరిమితం చేస్తూ కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు 14వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 25వ తేదీ వరకు మద్యం అమ్మకాలు, వినియోగంపై ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. పండుగల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవడం సాధారణమే అయినప్పటికీ, అందుకు అనుసరించే విధానం ప్రజలకు ఇబ్బందులు కలిగించకుండా ఉండాలని కోర్టు వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.
also read : దారుణ హత్య.. ఎఫైర్ అనుమానంతో యువకుడిని 17 సార్లు కత్తితో పొడిచి..
