జిల్లాలో పిడుగుల గర్జనతో ఇద్దరు వృద్ధ మహిళలు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. నరసరావుపేట మండల పరిధిలోని రెండు వేర్వేరు గ్రామాల్లో ఈ ఘటనలు జరిగాయి.
శనివారం రాత్రి నరసరావుపేట పరిసర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఈ సమయంలో పెట్లూరివారిపాలెం గ్రామానికి చెందిన తల్లపనేని నాగమ్మ (63) పిడుగు పడటంతో వచ్చిన భారీ శబ్దానికి తీవ్రంగా భయపడ్డారు. కొద్దిసేపటికే ఆమె గుండెపోటుకు గురై అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందారు.
ఇదే సమయంలో లక్ష్మీపురం గ్రామంలోనూ విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మేకల వెంకాయమ్మ (60) పిడుగుల భారీ శబ్దాలకు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అనంతరం గుండెపోటు రావడంతో ఆమె ప్రాణాలు కోల్పోయారు.
ఒకే మండల పరిధిలో వేర్వేరు గ్రామాల్లో ఇద్దరు వృద్ధ మహిళలు మృతి చెందడంతో విషాదం నెలకొంది. పిడుగుల గర్జనతో వచ్చిన భారీ శబ్దాల కారణంగానే తమ కుటుంబ సభ్యులు మృతి చెందారని మృతుల బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.
