-
కార్పొరేషన్ కైవసం చేసుకునేందుకు పావులు
-
మెజారిటీ సీట్లపై కన్ను
-
వరుసగా సమావేశాలు
-
పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: విజయవాడ మేయర్ పీఠంపై జనసేన గురి పెట్టిందా? పొత్తులో భాగంగా ఆ పదవిని కోరుకుంటుందా? ఈ మేరకు పావులు కదుపుతోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వరుసగా జరుగుతున్న పరిణామాలు అలానే ఉన్నాయి. నగరంలోని అన్ని డివిజన్లపై జనసేన ఫోకస్ పెట్టింది. వరుసగా సమావేశాలు నిర్వహిస్తోంది.
తద్వారా స్పష్టమైన సంకేతాలు పంపిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో విజయవాడ నగరంలో జనసేనకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. కానీ మేయర్ పీఠాన్ని దక్కించుకుని తన ముద్ర చాటుకోవాలని చూస్తోంది జనసేన నాయకత్వం. అందుకే వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
-
రాజకీయ కేంద్రం..
ఉమ్మడి రాష్ట్రంలోనైనా, నవ్యాంధ్రప్రదేశ్ లోనైనా విజయవాడకు రాజకీయంగా ప్రత్యేక స్థానం ఉంది. ప్రధానంగా విజయవాడలో పట్టు సాధిస్తే.. చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో ప్రభావం చూపవచ్చు. అందుకే ఆ ఆలోచనతోనే మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా.. విజయవాడ పై జనసేన దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపొందేందుకు ఇప్పటినుంచి వ్యూహాలు ప్రారంభించినట్లు అర్థం అవుతోంది.
ఇటీవల వరుసగా సమావేశాలు అవుతున్నారు జనసేన నేతలు. పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మెజారిటీ స్థానాలు దక్కించుకోవాలని.. పొత్తులో భాగంగా కచ్చితంగా విజయవాడ మేయర్ పీఠం కోరుతామని జనసేన ఆగ్రనేతలు ఆ పార్టీ శ్రేణులకు సూచించినట్లు తెలుస్తోంది.
-
ముందుగా మున్సిపల్ ఎన్నికలు..
ముందుగా మున్సిపల్ ఎన్నికల వైపు కూటమి ప్రభుత్వం మొగ్గు చూపుతోందని తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 12 కార్పోరేషన్లతో పాటు 108 మున్సిపాలిటీలు ఉన్నాయి. అయితే ఏడు కార్పొరేషన్లకు సంబంధించి విజయవాడ ను కోరేందుకు జనసేన ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో శ్రీకాకుళం, విజయనగరం,, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, ఏలూరు, విజయవాడ, గుంటూరు, తిరుపతి, నెల్లూరు, కడప, కర్నూలు కార్పొరేషన్లు ఉన్నాయి.
అయితే ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు విజయవాడ కార్పొరేషన్ ను పొత్తులో భాగంగా కోరాలని జనసేన భావిస్తోంది. ముఖ్యంగా విజయవాడపై పట్టు పట్టాలన్నది ఆ పార్టీ నిర్ణయం. అయితే దశాబ్దాలుగా విజయవాడ కార్పొరేషన్ పై టిడిపి ముద్ర ఉంది. పైగా ఆ పార్టీకి ఎమ్మెల్యేలతో పాటు ఎంపీ కూడా ఉన్నారు. అందుకే క్షేత్రస్థాయిలో అది సాధ్యమా?? అనే అనుమానాలు కూడా ఉన్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో..
