Homeఆంధ్ర ప్రదేశ్ప్ర‌పంచ‌మే సాగ‌ర‌నగ‌రం వైపు చూసేలా...నేడే గూగుల్ డేటా సెంట‌ర్‌కు శంకు స్థాప‌న‌...!

ప్ర‌పంచ‌మే సాగ‌ర‌నగ‌రం వైపు చూసేలా…నేడే గూగుల్ డేటా సెంట‌ర్‌కు శంకు స్థాప‌న‌…!

 

  • రూ.1.35 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు

విశాఖ‌ప‌ట్నం, క్రైమ్ మిర్ర‌ర్ : దేశమే కాదు… ప్రపంచమే ఇటువైపు తిరిగి చూసే రోజు రానే వచ్చింది.విశాఖ నగర కీర్తి కిరీటంలో మరో మణి వచ్చి చేరేందుకు సర్వం సిద్ధమైంది. ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్‌ రూ. 1.35 లక్షల కోట్లతో వేయి మెగావాట్ల సామర్థ్యంతో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) డేటా సెంటర్‌ ఏర్పాటుకు మంగళవారం శంకుస్థాపన జరగనుంది. విశాఖ సమీపంలోని ఆనందపురం మండలం తర్లువాడలోని 266 ఎకరాల్లో ఈ డేటా సెంటర్‌ ఏర్పాటు కానుంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌తో పాటు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, గూగుల్‌ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఈ డేటా సెంటర్‌ నిర్మాణంలో అదానీ కనెక్ట్స్‌, ఎయిర్‌టెల్‌ నెక్స్‌ట్రా భాగస్వాములుగా ఉన్నాయి. గూగుల్‌ ఇప్పటివరకు అమెరికా బయట రూ.లక్ష కోట్లకు మించి పెట్టుబడి పెట్టలేదు. భారతదేశంలో ఆ స్థాయి విదేశీ పెట్టుబడి ఏ రాష్ట్రానికీ రాలేదు. ఇక విశాఖలో డేటా సెంటర్‌ ఏర్పాటుకు అదానీ గ్రూపు గతంలోనే ఒప్పందం చేసింది.

మధురవాడ హిల్‌ నంబరు 4లో కేటాయించిన 170 ఎకరాల్లో రూ. 14,634 కోట్ల పెట్టుబడితో ఇంటిగ్రేటెడ్‌ డేటా సెంటర్‌ ఏర్పాటు చేస్తామని అప్పట్లో ప్రకటించింది. మొదట 200 మెగావాట్లు, ఆ తరువాత మరో 100 మెగావాట్లతో డేటా సెంటర్లు నిర్మిస్తామని పేర్కొంది. ఇక దేశంలో 14కు పైగా డేటా సెంటర్లను నిర్వహిస్తున్న సిఫీ ఇన్ఫినిటీ స్పేసెస్‌ లిమిటెడ్‌ విశాఖలో 550 మెగావాట్ల సామర్థ్యంలో డేటా సెంటర్‌ నిర్మాణానికి ఒప్పందం చేసింది.

గతేడాది డిసెంబరులో మంత్రి లోకేశ్‌ దీనికి శంకుస్థాపన చేశారు. ఆ సంస్థకు రెండు ప్రాంతాల్లో 28.6 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. ఇక్కడ రూ. 15,266 కోట్లు పెట్టుబడికి, అక్టోబరు 2027 నాటికి డేటా సెంటర్‌ ఆపరేషన్‌లోకి తీసుకు రావడానికి సిఫీ అంగీకరించింది. మరో ప్రసిద్ధ ఐటీ సంస్థ ఆర్‌ఎంజెడ్‌ రూ. 83 వేల కోట్ల పెట్టుబడితో విశాఖలో ఒక గిగావాట్‌ సామర్థ్యం కలిగిన డేటా సెంటర్‌ ఏర్పాటు చేస్తామని దావోస్‌లోనే ఒప్పందం చేసింది.

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) కూడా డేటా సెంటర్‌ ఏర్పాటు చేస్తామని ముందుకువస్తే రాష్ట్ర ప్రభుత్వం రుషికొండ ఐటీ పార్క్‌ హిల్‌ నంబరు 3పై 21.16 ఎకరాలు కేటాయించింది. అందులో రూ. 1,370 కోట్ల పెట్టుబడితో పనులు చేపతామని టీసీఎస్‌ ప్రకటించింది. ఇలా ఒక దాని వెంట మరొకటి విశాఖలో డేటా సెంటర్ల ఏర్పాటుకు బడా కంపెనీలు ముందుకు వస్తున్నాయి. వీటికి అవసరమైన సబ్‌సీ కేబుల్‌ ల్యాండింగ్‌ సెంటర్లు కూడా పెట్టడానికి పెద్ద పెద్ద సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి.

గూగుల్‌ సంస్థ ‘బ్లూరామన్‌’ పేరుతో సబ్‌సీ కేబుళ్లను విశాఖపట్నం తీసుకువస్తోంది. వీటిని డేటా సెంటర్‌తో అనుసంధానం చేయడానికి సిఫీ టెక్నాలజీస్‌తో ఒప్పందం చేసుకుంది. భారత్‌లో ముంబై, విశాఖ నగరాలను ల్యాండింగ్‌ సెంటర్లుగా ఎంపిక చేసుకున్న మెటా సంస్థ కూడా సబ్‌మెరైన్‌ కేబుళ్లను విశాఖపట్నం తీసుకువచ్చి డేటా సెంటర్లకు అనుసంధానం చేసే బాధ్యతను సిఫీకే అప్పగించింది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు