-
బీహార్ బైపోల్ లో ప్రశాంత్ కిషోర్
-
బంకిపూర్ లో పోటా పోటీ
-
అధికార పార్టీకి సవాల్ విసురుతున్న రాజకీయ వ్యూహకర్త
క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: బీహార్ లో బిజెపి అధికారంలో ఉంది. మొన్ననే భారీ మెజారిటీతో ఎన్డీఏ విజయం సాధించింది. అతిపెద్ద పార్టీగా బిజెపి అవతరించింది. నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కొద్ది రోజులకే రాజీనామా చేశారు. బిజెపి నేత ముఖ్యమంత్రి అయ్యారు.
ఈ నేపథ్యంలో పాట్నా నడిబొడ్డున ఉన్న బంకిపూర్ అసెంబ్లీ నియోజకవర్గ బైపోల్ ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం దేశవ్యాప్త దృష్టిని ఆకర్షిస్తోంది. దానికి కారణం ప్రశాంత్ కిషోర్. మొన్నటి ఎన్నికల్లో తన జన సూరజ్ పార్టీ ద్వారా రంగంలోకి దిగిన ప్రశాంత్ కిషోర్ దెబ్బ తిన్నారు. ఈ బైపోల్లో సత్తా చాటి బీహార్ రాజకీయాలను షేక్ చేయాలని చూస్తున్నారు.
-
బిజెపికి కంచుకోట..
బంకిపూర్ నియోజకవర్గం దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీకి కంచుకోటగా ఉంది. బిజెపి తరఫున వరుసగా గెలుస్తూ వచ్చారు నితిన్ నబీన్. మొన్నటి ఎన్నికల్లో కూడా ఆయన గెలిచారు. అయితే బిజెపి హై కమాండ్ ఆయనను జాతీయ అధ్యక్షుడిగా ఎంపిక చేసింది. ఆ తరువాత రాజ్యసభ ఎంపీగా వెళ్లడంతో ఆ స్థానం ఖాళీ అయింది.
ప్రస్తుతం ఉప ఎన్నిక జరుగుతోంది. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి చతికిల పడింది జన సూరజ్ పార్టీ. అందుకే రాజకీయ అస్తిత్వాన్ని చాటుకోవాలని ప్రశాంత్ కిషోర్ బలంగా భావించారు. బంకి పూర్ నియోజకవర్గం నుంచి సంచలన విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార బిజెపికి ముచ్చమటలు పట్టిస్తున్నారు.
-
ఆ వర్గాలపై గురి..
ప్రశాంత్ కిషోర్ ప్రధానంగా సైలెంట్ యాంగ్రీ ఓటర్లను, బిజెపి సంప్రదాయ ఓటు బ్యాంకు పై గురిపెట్టారు. ఇంకోవైపు నిరుద్యోగం, స్థానిక మౌలిక సదుపాయాల కొరత, ఇటీవల దేశవ్యాప్తంగా కలకలం రేపిన నీ పేపర్ లీకేజీ వివాదం తీవ్ర అసంతృప్తిని రగిలించాయని పీకే భావిస్తున్నారు.
నిశ్శబ్ద విప్లవాన్ని, ఆగ్రహాన్ని తన వైపు తిప్పుకొని బిజెపి ఓటు బ్యాంకుకు గండి కొట్టాలని చూస్తున్నారు. సుడిగాలి పర్యటనలు చేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. బిజెపి అభ్యర్థి పై సవాళ్లు విసురుతూ తానే ప్రధాన పోటీదారుడుగా రేసులో ఉన్నట్లు సంకేతాలు పంపిస్తున్నారు.
-
సర్వశక్తులు ఒడ్డుతున్న బిజెపి..
అధికార బిజెపి ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సొంత నియోజకవర్గ కావడం, యువనేత నీరజ్ కుమార్ సిన్హాను బరిలో దించడంతో ఈ స్థానాన్ని నిలబెట్టుకోవడం బిజెపికి ప్రతిష్టాత్మకంగా మారింది. నితిన్ నవీన్ తో పాటు ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, రవిశంకర్ ప్రసాద్, సినీ నటులు మనోజ్ తివారి, పవన్ సింగ్, చిరాగ్ పాస్వాన్ వంటి అగ్రనేతులను రంగంలోకి దించుతోంది.
మరోసారి భారీ మెజారిటీ సాధించేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. మరోవైపు ఆర్ జె డి అభ్యర్థి రేఖ గుప్తా సైతం తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. ఈ త్రిముఖ పోటీలో విజయం ఎవరికి వరిస్తుందో చూడాలి.
