-
ఏడాది పాటు స్థానిక ఎన్నికలు వాయిదా
-
డీఎంకే హయాంలో ఎన్నికల అధికారి ఉండడమే కారణం
-
క్షేత్రస్థాయిలో బలపడని టీవీకే
క్రైమ్ మిర్రర్,సెంట్రల్ డెస్క్: తమిళనాడులో విజయ్ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతుంది. పూర్తిస్థాయిలో మెజారిటీ సాధించలేకపోయారు. కానీ సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి. కానీ నిర్వహించేందుకు సీఎం విజయ్ ఆసక్తి చూపడం లేదు.
వచ్చే ఏడాదికి వాయిదా వేసి ఆలోచనతో ఉన్నారు. స్థానిక ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కానీ డీఎంకే హయాంలో రాష్ట్ర ఎన్నికల అధికారి నియామకం కావడంతో.. ఆమెను తప్పించాలని చూస్తున్నారు విజయ్. కానీ ఆమె రాజీనామా చేసే అవకాశం లేదు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
-
సాధారణ ఎన్నికలు కాదు..
తమిళనాడులో సంచలన విజయం సాధించారు విజయ్. తనకు ఉన్న గ్లామర్ ఇమేజ్ తో ఎటువంటి అంచనాలు లేకుండా మెజారిటీ సీట్లు సాధించారు. అధికారానికి కూత వేటు దూరంలో నిలిచారు. కాంగ్రెస్ తో పాటు ఇతర పక్షాల సాయంతో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు.
అయితే సార్వత్రిక ఎన్నికల మాదిరిగా ఉండదు స్థానిక సంస్థల ఎన్నికల పరిస్థితి. క్షేత్రస్థాయిలో పనిచేసే క్యాడర్ ఉంటేనే అక్కడ గెలుపు సాధ్యం. గ్రామాల్లో ప్రతిష్టమైన బూత్ స్థాయి యంత్రాంగం, క్షేత్రస్థాయిలో నాయకత్వం లేకపోవడం టివికేకు మైనస్. విజయ్ వెనుకడుగు వేయడానికి అది కూడా ఒక ప్రధాన కారణం.
-
ప్రాంతీయ సమీకరణలు..
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాంతీయ సమీకరణలు, క్షేత్రస్థాయిలో వ్యక్తిగత ప్రభావం పనిచేస్తాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన విజయ్ పార్టీ ఇంకా పల్లెల్లో చొచ్చుకొని వెళ్లలేదు. పార్టీ కమిటీలు కూడా పూర్తిస్థాయిలో ఏర్పాటు కాలేదు. ఈ నేపథ్యంలో హడావిడిగా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే ఇబ్బందికరం అని విజయ్ భావిస్తున్నారు.
అందుకే సంస్థాగత నిర్మాణం పూర్తయిన తర్వాతే.. స్థానికంగా బలమైన అభ్యర్థులను బరిలో దించితే కానీ నెగ్గలేమని విజయ్‌కు తెలుసు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో డీఎంకే బలంగా ఉంది. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలను మరో ఏడాది పాటు వాయిదా వేసేందుకు విజయ్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
