-
రేపు శ్రీకాకుళం నగరానికి జగన్మోహన్ రెడ్డి
-
మాజీమంత్రి అప్పలరాజు పరామర్శ
-
తనను ఫోన్లో కనీసం పరామర్శించని అధినేత
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీరుపై సీనియర్ నేత తమ్మినేని సీతారాం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. ఇటీవల ఆయన ఓ ఆస్తి వివాదానికి సంబంధించి చట్టపరమైన కేసులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.
ఓ భూమి రిజిస్ట్రేషన్ కు సంబంధించి అసలు యజమాని ఉండగా.. ఆయన వారసులపేరుతో తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించి.. అక్రమంగా తన కుమారుడు పేరుతో రాయించుకున్నారని పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు తమ్మినేని సీతారాం తో పాటు ఆయన కుమారుడు, భార్యపై కేసు నమోదు చేశారు.
ఏ క్షణంలోనైనా వారి అరెస్టు ఉంటుందన్న ప్రచారం జరిగింది. దీంతో తమ్మినేని కుటుంబంతో సహా పరారయ్యారు. చివరకు హైకోర్టులో ముందస్తు బెయిల్ దక్కడంతో సోషల్ మీడియాలో ఒక ప్రత్యేక వీడియో విడుదల చేశారు. అందులో తమ తప్పు ఏమీ లేదని చెప్పుకొచ్చారు.
అయితే ఇంతవరకు తమ్మినేని సీతారాంను జగన్మోహన్ రెడ్డి పరామర్శించలేదని తెలుస్తోంది. అదే సమయంలో మాజీమంత్రి అప్పలరాజును పరామర్శించేందుకు గురువారం శ్రీకాకుళం వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. దీంతో తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారట తమ్మినేని సీతారాం.
-
నియోజకవర్గ బాధ్యతలను తప్పించి..
మొన్నటి ఎన్నికల్లో ఆమదాలవలస నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు తమ్మినేని సీతారాం. స్పీకర్ గా ఉన్న ఆయన ఓటమి పాలయ్యారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఆమదాలవలస నియోజకవర్గ బాధ్యతల నుంచి తమ్మినేని సీతారాంను తప్పించారు. ఓ ద్వితీయ శ్రేణి నాయకుడికి బాధ్యతలు అప్పగించారు. అయితే నియోజకవర్గ బాధ్యతలను తన కుమారుడు చిరంజీవి వెంకట్ నాగ్ కు అప్పగించాలని కోరారు తమ్మినేని.
అయితే ఎన్నికల సమయంలో చూద్దాం అని జగన్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇంతలోనే ఇప్పుడు తమ్మినేని తో పాటు ఆయన కుమారుడు భూ వివాదంలో చిక్కుకున్నారు. దీంతో మాట వరసకైనా జగన్మోహన్ రెడ్డి తమ్మినేనిని పట్టించుకోలేదని తెలుస్తోంది.
శుక్రవారం శ్రీకాకుళం వస్తున్న జగన్ నేరుగా అప్పలరాజును పరామర్శించనున్నారు. కేవలం ఆ పర్యటన వరకే షెడ్యూల్ను ఖరారు చేశారు. శ్రీకాకుళం నగరానికి కూతవేటు దూరంలో ఉన్న ఆమదాలవలస వైపు చూడకపోవడంతో తమ్మినేని ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.
-
దువ్వాడ సంఘీభావం..
మరోవైపు తమ్మినేని సీతారాంను వైసీపీ సస్పెన్షన్ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి కలిసారు. సంఘీభావం తెలిపారు. ఇప్పటికే దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం కారణంగా సస్పెన్షన్కు గురైన సంగతి తెలిసిందే. వైసీపీలోకి వచ్చి మళ్లీ పోటీ చేస్తానని నమ్మకంతో ఉన్నారు దువ్వాడ. కానీ పార్టీ నుంచి మాత్రం ఎటువంటి భరోసా లేదు.
ఇప్పుడు తమ్మినేని పరిస్థితి కూడా అలానే ఉంది. అందుకే ఆ ఇద్దరు నేతలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను పోటీ పెట్టేందుకు ఇద్దరు నేతలు నిర్ణయించుకున్నట్లు సమాచారం. అటు కింజరాపు, ఇటు ధర్మాన ఫ్యామిలీలకు వ్యతిరేకంగా ఇద్దరు నేతలు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే టిడిపి కూటమికంటే వైసీపీకి డామేజ్ జరగడం ఖాయం.
