-
పక్కా వ్యూహంతో బొత్స సత్యనారాయణ
-
రాజకీయ వారసత్వం కొనసాగింపునకు భారీ ప్రణాళిక
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఉమ్మడి రాష్ట్రంలోనే సీనియర్ మోస్ట్ లీడర్ బొత్స సత్యనారాయణ. ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్నారు. శాసనమండలిలో వైసిపి పక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో క్రియాశీలక రాజకీయాలనుంచి తప్పుకొని.. వారసులను రంగంలోకి దించాలని చూస్తున్నారు.
అయితే ఇద్దరు పిల్లలు డాక్టర్లు కావడం గమనించదగ్గ విషయం. కుమారుడ్ని చీపురుపల్లి ఎమ్మెల్యేగా.. కుమార్తెను జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా చేసేందుకు ఆయన పావులు కదుపుతున్నారు. విజయనగరం జిల్లా పై పట్టు కోల్పోకూడదు అని భావిస్తున్నారు. ఆదిశగా చాప కింద నీరుల ప్రయత్నాలు చేస్తున్నట్లు పొలిటికల్ వర్గాల్లో ఒక ప్రచారం ఉంది.
-
అంతటా బొత్స హవా..
విజయనగరం జిల్లా అంటేనే బొత్స హవా నడుస్తూ వచ్చింది. ఒక సాధారణ పిఎసిఎస్ అధ్యక్షుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు బొత్స. అనతి కాలంలోనే ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా కూడా పదవులు అందుకున్నారు. తనతోపాటు కుటుంబ సభ్యులందరినీ రాజకీయాల్లోకి తెచ్చారు.
బొత్స సోదరుడు అప్పల నరసయ్య గజపతినగరం నుంచి.. మరో సోదరుడు అప్పలనాయుడు నెల్లిమర్ల నుంచి.. భార్య ఝాన్సీ లక్ష్మి విజయనగరం ఎంపీగా… మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు జిల్లా పరిషత్ చైర్మన్ గా.. ఇలా ఆ కుటుంబ సభ్యులంతా పదవులు చేపడుతూ జిల్లాలో బొత్స హవాను చాటారు. ఇప్పుడు దానిని కొనసాగింపుగా తన ఇద్దరి పిల్లలను రంగంలోకి దించుతున్నారు బొత్స.
-
ఎమ్మెల్యేగా సందీప్..
బొత్స కుమారుడు సందీప్ వైద్యవృత్తిలో కొనసాగుతున్నారు. విజయనగరంలో ప్రాక్టీస్ పెట్టారు. అవకాశం ఉన్నప్పుడల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో పర్యటిస్తూ వస్తున్నారు. శుభకార్యాలకు హాజరవుతున్నారు. పార్టీ శ్రేణులకు పరామర్శిస్తూ వచ్చారు.
పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఆందోళన కార్యక్రమాలకు తరచూ హాజరవుతున్నారు. పార్టీ శ్రేణులతో మమేకమై పనిచేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి గెలిపించి జగన్ క్యాబినెట్లో మంత్రి పదవి ఇప్పించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
-
జడ్పిటిసి గా అనూష..
మరోవైపు బొత్స కుమార్తె అనూషను సైతం రాజకీయాల్లోకి తెచ్చేందుకు ఆమె తండ్రి నిర్ణయం తీసుకున్నారు. తన భార్య ఝాన్సీ లక్ష్మీ మాదిరిగా కుమార్తె అనూషను తొలత జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా గెలిపించుకోవాలని చూస్తున్నారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా ప్రస్తానాన్ని ప్రారంభించిన ఝాన్సీ లక్ష్మి తరువాత కాలంలో ఎంపీగా గెలిచారు.
మొన్నటి ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అందుకే ఇప్పుడు కుమార్తె అనూషను సైతం ముందుగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా పరిచయం చేసి.. మిగతా పదవులు అందుకునేలా ప్రణాళిక రూపొందించారు. మరి ఇందులో ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.
