* గవర్నర్ కోర్టులో బంతి
* ఏప్రిల్ నెలాఖరులోగా ఎమ్మెల్సీ అయితే సేఫ్
* లేకుంటే కష్టమే!
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో ఇప్పుడు అందరి దృష్టి మంత్రి అజారుద్దీన్ పై ఉంది. మొన్ననే ఆయన మంత్రి అయ్యారు. అయితే ఆయన చట్టసభల్లో సభ్యుడు కారు. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచేందుకు ఆయనను మంత్రివర్గంలోకి తీసుకున్నారు సీఎం రేవంత్. అయితే ఆ ఎన్నికల్లో అది వర్కౌట్ అయింది. ముస్లిం ఓటు బ్యాంకు పై ప్రభావితం చేసింది. కానీ ఇప్పుడు అసలు సమస్య అజారుద్దీన్. ఎందుకంటే మంత్రిగా ఎన్నికైన ఆయన ఆరు నెలల లోపు చట్టసభల్లో సభ్యుడు కావాలి. ఆ ఆరు నెలలు ఇప్పుడు సమీపిస్తోంది. ఏప్రిల్ నెలాఖరకు ఈ గడువు పూర్తి కానుంది. దీంతో ఎమ్మెల్యేగా కానీ.. ఎమ్మెల్సీగా గాని అజారుద్దీన్ ఎంపిక కావాల్సిన అనివార్య పరిస్థితి ఇప్పుడు ఎదురైంది.
ముందుగానే ప్రతిపాదనలు..
అయితే అజారుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకోక మునుపే ఎమ్మెల్సీగా ఆయన పేరు సిఫార్సులు చేస్తూ గవర్నర్కు ప్రతిపాదనలు పంపించింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయడానికి గవర్నర్ కు పంపడం.. దీనిపై సుప్రీం కోర్టులో కేసు పడిన నేపథ్యంలో మళ్లీ ప్రతిపాదన పంపాల్సి వచ్చింది. రెండోసారి ప్రొఫెసర్ కోదండరాం తో పాటు అజారుద్దీన్ పేరును సిఫార్సు చేశారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో గవర్నర్ పెండింగ్లో పెట్టారు. గత నెలలో ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ప్రభుత్వ వాదనలు విన్న అనంతరం ఎమ్మెల్సీల ఎంపిక విషయంలో గవర్నర్ నిర్ణయం తీసుకోవచ్చని తీర్పు చెప్పింది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరికీ ఎమ్మెల్సీలుగా ఆమోదముద్ర లభిస్తుందని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. దీంతో ప్రభుత్వ పెద్దల నుంచి గవర్నర్ పై ఒత్తిడి పెరిగింది. కానీ ఇంతలో గవర్నర్ బదిలీ అయ్యారు. కొత్త గవర్నర్ వచ్చారు.
కొత్త గవర్నర్ వద్ద పంచాయితీ..
ఇటీవల తెలంగాణకు కొత్త గవర్నర్ గా శివప్రసాద్ శుక్ల వచ్చారు. ఆయన ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో కాకలు తీరిన యోధుడు. అక్కడి సీఎం యోగి ఆదిత్యనాథ్ తోనే పోటీపడిన నేత. బిజెపి భావజాలం వంట పట్టించుకున్న నాయకుడు. అటువంటి నేతను తీసుకొచ్చి తెలంగాణకు గవర్నర్గా నియమించింది బిజెపి హై కమాండ్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టెన్షన్ కూడా అదే. ఒకవేళ రకరకాల కొర్రీలు పెట్టి ఎమ్మెల్సీల నియామకాన్ని గవర్నర్ అడ్డుకుంటే మాత్రం మహమ్మద్ అజారుద్దీన్ మంత్రి పదవి ఊడిపోవాల్సిందే. అదే జరిగితే తెలంగాణలో రేవంత్ సర్కార్ నవ్వుల పాలు కావడం ఖాయం. అందుకే అందరి దృష్టి ఇప్పుడు తెలంగాణ మంత్రి అజారుద్దీన్ పై ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
