Alert: తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఒక్కసారిగా పెరిగి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వేసవి ప్రారంభ దశలోనే భానుడి ప్రభావం ఈ స్థాయిలో కనిపించడం సాధారణ పరిస్థితులకు భిన్నంగా ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రానున్న 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఎండలు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. పగటి వేళల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగి సాధారణ స్థాయికి మించి నమోదవుతున్నాయి. నిన్న దేశంలోనే అత్యధికంగా కర్నూలులో 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడం ఎండల తీవ్రతను స్పష్టంగా చాటిచెప్పింది. వేడిగాలులు వీచడంతో ప్రజలు ఇళ్లకు పరిమితమవుతున్నారు.
అయితే మరోవైపు కొన్ని జిల్లాల్లో వాతావరణంలో విభిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అల్లూరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో అసాధారణంగా పొగమంచు కురవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వేసవిలో పొగమంచు కనిపించడం అరుదైన పరిణామమని నిపుణులు చెబుతున్నారు. వాతావరణంలో చోటుచేసుకుంటున్న ఈ మార్పులు రానున్న రోజుల పరిస్థితులపై సందేహాలను కలిగిస్తున్నాయి. ఎండల తీవ్రతతో ఇప్పటికే వ్యవసాయ రంగంపై ప్రభావం కనిపిస్తోంది. ముఖ్యంగా మామిడి తోటల్లో పూత, పిందె దశలో ఉన్న కాయలు వేడిని తట్టుకోలేక రాలిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం రానున్న 4 రోజుల్లో ద్రోణిగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 7 తేదీ తర్వాత కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఎండాకాలం ప్రారంభంలోనే ఇలాంటి ఆకస్మిక మార్పులు రావడం మామిడి తోటలకు తీవ్రమైన ప్రభావం చూపే అవకాశముంది. ముఖ్యంగా పూత, పిందె దశలో ఉన్న తోటలకు ఈదురు గాలులు, వర్షాలు పెద్ద నష్టం కలిగించే ప్రమాదం ఉందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అకాల వర్షాల వల్ల తోటల్లో తేమ శాతం పెరిగి వివిధ రకాల తెగుళ్లు సోకే అవకాశం ఉందని ఉద్యానవన శాఖ అధికారులు సూచిస్తున్నారు. వర్ష సూచనలు ఉన్న నేపథ్యంలో తాత్కాలికంగా మందుల పిచికారీని వాయిదా వేసుకోవడం మంచిదని రైతులకు సూచిస్తున్నారు. అలాగే వర్షపు నీరు తోటల్లో నిల్వ ఉండకుండా కాలువలు శుభ్రం చేసుకోవాలని, గాలి వానల సమయంలో కాయలు రాలిపోకుండా తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని అప్రమత్తం చేస్తున్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అధికారులు సూచిస్తున్నారు.
ALSO READ: Jadcherla: సిబ్బంది నిర్లక్ష్యానికి పరాకాష్ట!.. శవాన్ని పీక్కుతిన్న కుక్కలు
