క్రైమ్ మిర్రర్, సినిమా:- తెలుగు సినీ పరిశ్రమలో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సుహాస్, ఇప్పుడు తమిళ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. హీరోగా వరుస సినిమాలు చేస్తూనే, మరోవైపు కీలక పాత్రలు మరియు నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తూ తన ప్రతిభను చాటుకుంటున్న ఆయన, తాజాగా తమిళ్‌లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ మండాడి లో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.తమిళ్ నటుడు సూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో సుహాస్ విలన్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సినిమాపై మంచి ఆసక్తిని పెంచాయి. ముఖ్యంగా సూరి, సుహాస్ ఇద్దరూ రఫ్ అండ్ రస్టిక్ లుక్‌లో కనిపించడం అభిమానులను ఆకట్టుకుంది.
మండాడి చిత్రం తీరప్రాంత జీవితం, మత్స్యకారుల నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతోంది. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సముద్రంలో చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలు, భావోద్వేగ సన్నివేశాలు, ఉత్కంఠభరితమైన సెయిల్‌బోట్ రేస్ ఎపిసోడ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. భారీ నిర్మాణ విలువలతో రూపొందుతున్న ఈ సినిమా కోసం నిర్మాతలు దాదాపు రూ.80 కోట్ల బడ్జెట్ ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.ఈ చిత్రానికి మదిమారన్ పుగళేంది దర్శకత్వం వహిస్తుండగా, ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్‌ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇటీవల షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా పూర్తి చేసుకుంటోంది.
తాజాగా చిత్ర బృందం మండాడి విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రం సెప్టెంబర్ 4న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ పోస్టర్‌ను కూడా మేకర్స్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఇక ఈ సినిమాలో మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రముఖ నటులు సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. విభిన్న కథాంశం, భారీ నిర్మాణ విలువలు, బలమైన నటీనటులతో రూపొందుతున్న మండాడి పై ప్రస్తుతం మంచి అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా తమిళ్‌లో సుహాస్ తొలి ప్రధాన ప్రాజెక్ట్ కావడంతో తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మనుషుల పనులు నేర్చుకుంటున్న AI.. రేపటి ఉద్యోగాలకు ముప్పేనా..!