క్రైమ్ మిర్రర్, సినిమా:- పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓజీ 2 సినిమాపై తాజా అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఓజీ’ సినిమా ఘన విజయాన్ని సాధించిన తర్వాత దాని సీక్వెల్ ఎప్పుడు ప్రారంభమవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ చేసిన తాజా పోస్ట్ చర్చనీయాంశంగా మారింది.ఓజీ చిత్రంలో పవన్ కళ్యాణ్ స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలు, పవన్ మేకోవర్, సుజీత్ టేకింగ్ సినిమాను బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయంగా నిలబెట్టాయి. సినిమా విడుదల సమయంలోనే దర్శకుడు సుజీత్, చిత్రబృందం ఓజీ 2 కూడా ఉంటుందని అధికారికంగా ప్రకటించారు.
అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉండటం, దర్శకుడు సుజీత్ మరో ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టడం వల్ల ఓజీ 2 త్వరలో ఉండకపోవచ్చనే ప్రచారం జరిగింది. కానీ ఈ ఊహాగానాలకు చెక్ పెడుతూ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సోషల్ మీడియాలో ఆసక్తికరమైన సందేశాన్ని పోస్ట్ చేసింది.
మాట ఇచ్చినట్లే ఆయన చేస్తారు. సమయం ఎప్పుడనేది ఆయనే చెబుతారు. సుజీత్ విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత దీనిపై చర్చిద్దాం అని పేర్కొంది. దీంతో ఓజీ 2 ప్రాజెక్ట్ ఖచ్చితంగా పట్టాలెక్కుతుందని అభిమానులు భావిస్తున్నారు. సుజీత్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్ పూర్తయ్యాక ఈ సినిమా పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.
ఇక ‘ఓజీ’ సినిమా ముగింపులోనే పార్ట్-2కు బలమైన లీడ్ ఇచ్చిన విషయం తెలిసిందే. కథలో ఓజాస్ గంభీర గతం, జపాన్ నేపథ్యం, అక్కడి గ్యాంగ్‌స్టర్ ప్రపంచంతో అతనికి ఉన్న సంబంధాలను మరింత విస్తృతంగా చూపించే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. దర్శకుడు సుజీత్ గతంలో చేసిన వ్యాఖ్యల ప్రకారం, ఓజీ 2 కథ ప్రీక్వెల్ తరహాలో ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి.అయితే కథ, షూటింగ్ షెడ్యూల్ లేదా విడుదల తేదీపై ఇప్పటివరకు అధికారిక వివరాలు వెలువడలేదు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ టీమ్ ఇచ్చిన తాజా సంకేతాలతో ఓజీ 2 పై అభిమానుల్లో మళ్లీ ఉత్సాహం నెలకొంది. ఇప్పుడు అందరి దృష్టి సుజీత్ తిరిగి వచ్చిన తర్వాత జరిగే చర్చలపైనే ఉంది.