-ఫలించని కేటీఆర్ ప్రయత్నాలు
-రేవంత్ క్రిమినల్ వేస్ట్ కామెంట్ చుట్టూ గులాబీ పార్టీ రాజకీయం
-యువత రోడ్లపైకి వచ్చి పోరాటం చేయాలని నినాదం
-పట్టించుకోని తెలంగాణ సమాజం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో :-
దేశవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు జెన్ జీ. ఈ ఉద్యమంతో ప్రతిపక్షాలు కొంత ఊపిరి పీల్చుకుంటున్నాయి.. కొత్త రాజకీయ పార్టీలకు సరికొత్త అవకాశం దొరుకుతోంది. అయితే తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న భారత రాష్ట్ర సమితి ఈ ఉద్యమాన్ని ఉపయోగించుకోవాలని చూసింది. జెన్ జీ ఓటర్లను కాంగ్రెస్ కు వ్యతిరేకంగా రోడ్లపైకి తేవడానికి కేటీఆర్ చాలా ప్రయత్నాలు చేశారు. ఎన్నెన్నో ప్రకటనలు చేశారు. కానీ అవి ఏది వర్కౌట్ కాలేదు.
కేటీఆర్ పదేపదే రెచ్చగొట్టిన..
సీఎం రేవంత్ రెడ్డి ఉపయోగించిన క్రిమినల్ వేస్ట్ అనే పదాన్ని కేటీఆర్ చాలా చాకచక్యంగా పట్టుకున్నారు. రేవంత్ రెడ్డి నిరుద్యోగ యువతను క్రిమినల్ వేస్ట్ అని అవమానించారంటూ.. ఆ పదాన్ని యువతకు ఆపాదించి వారిలో ఆగ్రహ జ్వాలలు రగిలించేందుకు పదేపదే ప్రయత్నం చేశారు. ప్రెస్ మీట్ లు పెట్టి తీవ్రస్థాయిలో ప్రచారం చేశారు. కేటీఆర్ అంత గట్టిగా ప్రయత్నాలు చేసినా యువత నుంచి కానీ.. సామాజిక మాధ్యమాల నుంచి కానీ అసలు స్పందన కరువైంది. సీఎం రేవంత్ అన్న మాటను తమకు అన్వయించుకోవడానికి తెలంగాణ యువత పెద్దగా ఆసక్తి చూపలేదు. కేవలం స్కిల్స్ లేని యువత, ఇంజనీరింగ్ విద్యార్థుల గురించి అలా మాట్లాడారు రేవంత్. అందుకే వాటిని తమకు ఆపాదించుకోవడానికి తెలంగాణ విద్యార్థులు ముందుకు రాలేదు. ఫలితంగా కేటీఆర్ ఆశించిన మాదిరిగా అక్కడ తిరుగుబాటు రాలేదు. పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ధర్నాలు, ఉద్యమాలు చేయలేదు.
గత తప్పిదాలతో..
దేశంలో ఇతర రాష్ట్రాలకు విరుద్ధంగా ఉంది తెలంగాణలో పరిస్థితి. జార్ఖండ్ వంటి రాష్ట్రంలో విద్యార్థులు భారీ ఎత్తున రోడ్లపైకి వచ్చి వినూత్న నిరసనలు తెలుపుతున్నారు. అక్కడ పరీక్షకు సంబంధించిన లీకేజీ వ్యవహారంలో మిత్రపక్షాల పిలుపునకు స్పందించారు విద్యార్థులు. కానీ తెలంగాణలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. భారత రాష్ట్ర సమితి తమకు రెచ్చగొడుతోందన్న అసలు వాస్తవం తెలంగాణ యువతకు తెలుసు. ఎందుకంటే భారత రాష్ట్ర సమితి తో పాటు కేటీఆర్ పట్ల పాత అసంతృప్తి ఉంది యువతలో. గడిచిన పదేళ్ల భారత రాష్ట్ర సమితి పాలనలో వరుసగా పేపర్ లీకేజీ అంశాలు, గ్రూప్ పరీక్షల రద్దు, యాళ్ల తరబడి పడని నోటిఫికేషన్ ల వల్ల యువత తీవ్రంగా నష్టపోయారు. నాడు అధికారంలో ఉండి నిరుద్యోగ యువతను పట్టించుకోలేదన్న విమర్శ గులాబీ పార్టీపై ఉంది. ఇప్పుడు అదే అంశాన్ని పట్టుకొని రాజకీయం చేస్తామంటే అక్కడే యువత పట్టించుకోవడం లేదు.
నమ్మకం లేక..
తెలంగాణ యువత ఎక్కువగా ప్రత్యేక రాష్ట్ర సెంటిమెంటును గౌరవించారు. కెసిఆర్ తో పాటు కేటీఆర్ మాటలను నమ్మారు. కానీ పదేళ్ల గులాబీ పార్టీ పాలనలో అసలు విషయం తెలిసిపోయింది. పదేళ్ల గులాబీ పార్టీ పాలనతో పోల్చితే రెండున్నర సంవత్సరాల రేవంత్ పాలనలో.. ఉద్యోగ నియామకాలు జరిగాయి. మెగా డీఎస్సీ, గ్రూప్ పరీక్షల నియామకాల వేగం, ఇచ్చిన నోటిఫికేషన్ భర్తీ ప్రక్రియను గమనిస్తున్న యువత.. ఇలాంటి రాజకీయ రెచ్చగొట్టే వ్యవహారాలకు లొంగి ప్రసక్తి లేదు. కేవలం ప్రతిపక్షం కొన్ని పదాలను పట్టుకుని.. తమ ద్వారా రాజకీయం చేయాలనుకునే ప్రయత్నాన్ని ఆదిలోనే పసిగట్టింది తెలంగాణ యువత. అందుకే కేటీఆర్ పాచికలు పారలేదు.
