– సీఎం రేసులో ఉన్నానంటూ ప్రకటన
– ప్రణాళిక బద్దంగా నియోజకవర్గాల ఎంపిక
– పాంచ జన్య సంకల్ప సభలతో ఉనికి చాటుకునే యత్నం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో :-
కల్వకుంట్ల కవిత వ్యూహాత్మక రాజకీయానికి తెర తీశారు. ఎంపిక చేసిన నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ప్రణాళిక బద్ధంగా నియోజకవర్గాల నియామకాల ద్వారా క్యాడర్ విస్తరించే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటికే తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలుగా కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపిలు ఉన్నాయి. వాటి మధ్య అధికారం కోసం గట్టి పోరాటం జరుగుతోంది. కానీ ఇటువంటి సమయంలో కవిత ప్రభావం చూపాలనుకోవడం మాత్రం సాహసమే. ఆమె తెలంగాణ రక్షణ సేనకు ద్వితీయ శ్రేణి యంత్రాంగం లేదు. నిధులు సమకూర్చే కార్పొరేట్ అండదండలు లేవు. అయినా సరే పార్టీ ప్రారంభంలో ఎదురవుతున్న ఆర్థిక, సంస్థాగత ప్రతిబంధకాలను అధిగమిస్తూ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ప్రతి చిన్న కార్యక్రమానికి, క్యాడర్ కదలికలకు అయ్యే ఖర్చులను స్వయంగా భరిస్తూనే.. ప్రణాళిక బద్ధమైన నియోజకవర్గాల నియామకాల ద్వారా.. నిశ్శబ్దంగా కేడర్ను విస్తరించే ప్రయత్నాల్లో ఉన్నారు.
ప్రజలను ఆకర్షించే ప్రయత్నం..
రాష్ట్రవ్యాప్తంగా పాంచ జన్య సంకల్ప సభలు నిర్వహిస్తున్నారు కవిత. వాటి ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నాల్లో ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ వేదికగా వందలాది వాహనాల కాన్వాయ్ తో సభ నిర్వహించడం, ఆపై ఇంద్రవెల్లి వైపు అడుగులు వేయడం ద్వారా.. తాను కేవలం నామమాత్రపు పాత్రకు పరిమితం కావడం లేదని స్పష్టమైన సంకేతాలు పంపారు. నేను ఎవరికీ బీ టీం కాదు. బహుజనుల శక్తిని నమ్ముకుని బరిలోకి దిగాను అంటూ వ్యాఖ్యానించారు. సీఎం రేసులో తాను ఉన్నానని ప్రకటిస్తూ తన కేడర్లో రాజకీయ స్తైర్యాన్ని నూరిపోసే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. గొప్ప కాన్ఫిడెన్స్ తో ముందుకు సాగుతున్నారు.
స్పష్టమైన అవగాహనతో..
రాజకీయాల్లో ఎత్తు పల్లాలను చవిచూశారు కవిత. ఎంపీగా సంచలన విజయమే కాదు.. అదే స్థాయిలో ఓటమిని సైతం ఎదుర్కొన్నారు. లిక్కర్ స్కాంలో జైలుకు కూడా వెళ్లి వచ్చారు. రాజకీయాల్లో పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు అని ఆమెకు తెలుసు. గడిచిన చేదు అనుభవాలు, గులాబీ పార్టీ నుంచి దూరమయ్యాక ఎదురైన ఒంటరితనం, భారీ వ్యయం అయ్యే రాజకీయ సమరంలో ఎదురయ్యే సవాళ్లు తెలిసినప్పటికీ ఆమె ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ప్రధాన పార్టీల నాయకత్వాలు సైతం కొన్ని సందర్భాల్లో వ్యూహాత్మక తడబాటులు చవిచూస్తుంటాయి. కానీ కవిత మాత్రం సొంత ఆర్థిక బలంతో నెట్టుకొస్తూ ప్రతి అడుగును ఒక పక్కా లెక్క తో వేస్తున్నారు. విజయం ఇప్పట్లో దొరికే పరిస్థితి లేకపోయినా.. ఆమె చేస్తున్న ప్రయత్నం మాత్రం అభినందనలు అందుకుటోంది.
