-
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా అమలు
-
రూ. 5 లక్షలతో కుటుంబ రక్షణ
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: సరికొత్త సంక్షేమ పథకానికి రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టింది. తెలంగాణలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత, సామాజిక భరోసా కల్పించే లక్ష్యంతో ముందడుగు వేసింది. రాష్ట్రంలోని అర్హులైన ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల జీవిత బీమా పథకాన్ని అధికారికంగా అమలు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకొని నవంబర్ 12న సిద్దిపేటలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రారంభించునున్నారు. పేద మధ్యతరగతి వర్గాల్లో కుటుంబ పెద్దన కోల్పోయినప్పుడు ఆ ఇల్లు రోడ్డున పడకుండా ఆదుకునేందుకు ఈ పథకం ఒక బలమైన రక్షణ కవచంలా నిలవనుంది. గతంలో ఏపీ ప్రభుత్వం చంద్రన్న బీమా పథకాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా తెలంగాణలో ఆ బీమా పథకం మాదిరిగానే అమలు చేసేందుకు రావణ్ సర్కార్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
లోటుపాట్లు లేకుండా…
ఈ బీమా పథకానికి సంబంధించి అమలు ప్రక్రియను ఎక్కడా లోటుపాట్లు జరగకుండా.. క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు అధికార యంత్రాంగం గట్టి కార్యాచరణను సిద్ధం చేసింది. నవంబర్ 20 నుంచి 30 వరకు రాష్ట్రంలోని ప్రతి గ్రామం, ఆవాసంలో ఇందిరమ్మ కమిటీలు ఇంటింటికి వెళ్లి దరఖాస్తులు సేకరించనున్నాయి. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, మండలాల్లో తహసిల్దార్లు ఈ దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన బాధ్యతలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు. లబ్ధిదారుల నమోదులో ఎలాంటి సాంకేతిక అవరోధాలు ఎదుర్కాకుండా డిజిటల్ డేటా బేస్ ను రూపొందించి.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అర్హులైన ప్రతి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల బీమా పరిధిని వర్తింపజేసేలా సర్కారు మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఆ విమర్శలతో…
కెసిఆర్ ప్రభుత్వ హయాంలో అమలైన రైతు బీమా పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పక్కన పెట్టింది అన్న విమర్శలు ఉన్నాయి. ఇవి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో తెచ్చిపెట్టాయి. అన్నదాతలు ఆకస్మికంగా మరణించినప్పుడు రైతు కుటుంబాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం.. రైతు బీమా నిలిచిపోవడంపై పల్లెల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. దానిని గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. కేవలం రైతులకు మాత్రమే పరిమితం కాకుండా సమాజంలోని అన్ని వర్గాల కుటుంబాలను కలుపుకుంటూ.. అంతకంటే విస్తృత పరిధిలో ఇందిరమ్మ జీవిత బీమా పేరిట ఈ పథకానికి శ్రీకారం చుడుతోంది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ ప్రతిష్టను తిరిగి నిలబెట్టుకునే దిశగా కీలక అడుగుగా ఇది కనిపిస్తోంది.
రాజకీయాలకు అతీతంగా ఈ పథకాన్ని అమలు చేయగలిగితే పొలిటికల్ మైలేజ్ వచ్చే అవకాశం ఉంది. ప్రాణ రక్షణ, కుటుంబ భద్రతతో ముడిపడి ఉన్న ఇలాంటి సున్నితమైన పథకం ఏ ఒక్క రాజకీయ పార్టీకో.. వర్గానికి పరిమితం కాకుండా.. పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి అందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గ్రామస్థాయిలో ఏర్పాటు అయ్యే ఇందిరమ్మ కమిటీలు పక్షపాతానికి తావు లేకుండా.. నిస్పాక్షికంగా దరఖాస్తులను ఆమోదించి.. నిజమైన లబ్ధిదారులకు క్లెయిమ్లు సత్వరమే అందేలా పారదర్శక వ్యవస్థ నిర్మించాల్సి ఉంటుంది. ఈ పథకం క్షేత్రస్థాయిలో ఎంత వేగంగా, వివాద రహితంగా అమలయితే.. ప్రభుత్వానికి అంతటి ప్రజాధరణ, సుపరిపాలన గుర్తింపు దక్కడం ఖాయం.
