హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం లోయర్ ట్యాంక్‌బండ్‌లో నిర్వహించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి గాంధీ, అంబేడ్కర్ రెండు కళ్లన్నారు.
స్వాతంత్ర్య పోరాటంలో మహాత్మా గాంధీ పాత్ర ఎంత ఉందో.. దేశాభివృద్ధిలో అంబేడ్కర్ పాత్ర అంతే ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాత్రను ఎవరూ మర్చిపోలేరని సీఎం తెలిపారు. గత ప్రభుత్వ కేబినెట్‌లో దళితులకు ప్రాధాన్యం ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ కేబినెట్‌లో దళితులకు ప్రాధాన్యం ఇచ్చామన్నారు. దళిత బిడ్డ బడ్జెట్ ప్రవేశపెడితే చూడలేకపోతున్నారంటూ విమర్శించారు.
మమ్ములను చూసి ఓర్వలేకపోతున్నరు…
ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ విక్రమార్కకు సీఎల్పీ నేత హోదాను తొలగించేలా కుట్రలు జరిగాయని ఆరోపించారు. ఎస్సీ నాయకుడు స్పీకర్‌గా, ఆర్థిక మంత్రిగా ఉండకూడదా అని ప్రశ్నించారు. గత పదేళ్లలో ఎనాడైనా డైట్ ఛార్జీలు పెంచారా అని నిలదీశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కడితే ఓర్వలేకపోతున్నారంటూ వ్యాఖ్యానించారు.
తెలంగాణ పబ్లిక్ స్కూల్ విధానంతో పిల్లల భవిష్యత్తు మారుతుందని తెలిపారు. ఇంటిగ్రేటెడ్, పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని చెప్పారు. అధికారంలోకి వచ్చాక 67వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామన్నారు. 67వేల ఉద్యోగాల్లో 87శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే వచ్చాయని వెల్లడించారు.. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
