హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: ఈ నెల 20న జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు బీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న అరాచక పాలనకు చమరగీతం పాడేందుకు తెలంగాణ సిద్దమైంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు రెండున్నర ఏళ్లు గడస్తున్న అమలు చేయడం లేదని, సొంత పార్టీ నాయకులే బహిరంగంగా పేర్కొంటున్నారు.
ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చి ప్రజాకంటక విధానాలను అవలంబిస్తున్న కాంగ్రెస్ సర్కార్‌పై మరో పోరుకు జగిత్యాల శ్రీకారం చుట్టనున్నది. ‘కేసీఆర్ రావాలి.. రేవంత్‌రెడ్డి పోవాలి’ అనే నినాదంతో జగిత్యాల జైత్రయాత్ర మొదలుకానున్నది. ఆనాడు రైతు కూలీల న్యాయమైన డిమాం డ్ల సాధనకు.. అణచివేత.. భూస్వాముల నియంతృత్వ ధోరణిపై దండెత్తిన జగిత్యాల.. ఇప్పుడు కాంగ్రెస్ నిరంకుశపాలనపై పోరుకు సమాయత్తమైంది. కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం రాష్ట్ర ప్రజలను మోసం చేసిన తీరు.. ఆరు గ్యారెంటీల పేరుతో వంచించడంపై నిరసన వ్యక్తం చేయనున్నది.
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పోవాలి.. బీఆర్‌ఎస్ అధికారంలోకి రావాలని, కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని చెప్తూ మూకుమ్మడిగా కాంగ్రెస్ నేతలు బీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 20న జగిత్యాలలోని మోతె రోడ్డులో ఏర్పాటు చేసిన సభలో లక్షలాది మంది సమక్షంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ స్వయంగా జీవన్‌రెడ్డికి గులాబీ కండువా కప్పి ఆహ్వానించనున్నారు. ఆయనతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి వందలాది కాంగ్రెస్ నేతలు, వేలాది కార్యకర్తలు బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు
జగిత్యాలకు కేసీఆర్ రాక…కాంగ్రెస్ పతనం…
జగిత్యాల గడ్డ నుంచే కాంగ్రెస్ పతనం ప్రారంభం కానున్నది. జీవన్‌రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతల చేరిక ఖాయం కావడం, ఈ నెల 20న జగిత్యాలకు కేసీఆర్ వస్తుండడంతో అందరి చూపు ఇప్పుడు జగిత్యాలపై పడింది. అనేక జిల్లాల్లోనూ కాంగ్రెస్ నేతలు బీఆర్‌ఎస్‌లో చేరుతారని సమాచారం. కాంగ్రెస్ పార్టీకి చెందిన అనేక మంది నాయకులు ఆ పార్టీని వీడేందుకు ఇక సమయం ఆసన్నమైందని భావిస్తున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్ ముఖ్య నేతలు సమాలోచనలు చేస్తుండగా మరికొన్ని చోట్ల తమ అనుచరులతో సమావేశాలు పెట్టుకుంటున్నారు.
రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అన్నిరంగాల్లో సర్వభ్రష్టత్వమయ్యిందని, పార్టీ ఇక కోలుకునే అవకాశమే లేదన్న అభిప్రాయం కాంగ్రెస్ కార్యకర్తల్లో వ్యక్తమవుతున్నది. పదేండ్ల కేసీఆర్ జమానాతో అసలు పోలికే లేదని, ఇంకా కాంగ్రెస్‌లో కొనసాగితే ప్రజలు తమను గ్రామాలకు కూడా రానివ్వరన్న అభిప్రాయం కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతున్నది.
