Homeక్రైమ్మర్రిగూడ మండలంలో ఆగని ఆలయాల దోపిడీలు..!

మర్రిగూడ మండలంలో ఆగని ఆలయాల దోపిడీలు..!

  • మర్రిగూడ మండలంలో ఆగని ఆలయాల దోపిడీలు

  • దొంగల బీభత్సం, గుప్తనిధుల వేటగాళ్ల అరాచకం.

  • యథేచ్ఛగా సాగుతున్న దేవాలయ భూముల ఆక్రమణ.

  • నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న దేవాదాయ శాఖా అధికారులు.

మర్రిగూడ(క్రైమ్ మిర్రర్): దొంగల బీభత్సం, గుప్త నిధుల తవ్వకాలతో భగవంతుడు కూడా భయపడే పరిస్థితి ఏర్పడింది.. ​నల్లగొండ జిల్లా మర్రిగూడ మండల పరిధిలోని, పలు గ్రామాలలో వెలిసిన పురాతన, పవిత్ర దేవాలయాలు ప్రస్తుతం అసాంఘిక శక్తులకు నిలయాలుగా, దొంగల పాలిట కామధేనువులుగా మారుతుండటం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. గత కొంతకాలంగా మండలంలోని పలు గ్రామాల్లో, వరుసగా జరుగుతున్న దొంగతనాలు భక్తులను బేంబేలెత్తిస్తున్నాయి.

దుండగులు ఏకంగా దైవ సన్నిధి అని కూడా చూడకుండా, ఆలయ తాళాలు పగలగొట్టి హుండీలను ఎత్తుకెళ్లడం, విలువైన గంటలు, మైక్ సెట్లు, పూజా సామాగ్రిని అపహరించుకుపోవడం నిత్యకృత్యంగా మారింది. ఈ వరుస దొంగతనాల వెనుక ఒక వ్యవస్థీకృత ముఠా ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ, పోలీసులు గానీ, దేవాదాయ శాఖ అధికారులు గానీ, ఇప్పటి వరకు ఒక్క నిందితుడిని కూడా పట్టుకోకపోవడం గమనార్హం.! కేవలం చిల్లర దొంగతనాలే కాకుండా, మండలంలోని చరిత్ర కలిగిన పురాతన ఆలయాల్లో, గుప్తనిధుల వేటగాళ్లు సాగిస్తున్న విధ్వంసం వర్ణనాతీతంగా ఉంది.

అర్ధరాత్రి వేళల్లో యంత్రాలతో గర్భాలయాలను సైతం తవ్వి పోస్తూ, విగ్రహాలను ధ్వంసం చేస్తూ వారు సాగిస్తున్న అరాచకాలకు అడ్డుకట్ట వేసే నాథుడే కరువయ్యారు. విచారకరమైన విషయం ఏమిటంటే, ఒకవైపు దొంగల భయం వెంటాడుతుంటే, మరోవైపు గ్రామాల్లోని దేవుడి మాన్యం భూములు, రాజకీయ పలుకుబడి ఉన్న అక్రమార్కుల చేతుల్లోకి వెళ్తున్నాయన్న ఆరోపణలు వినపడుతున్నాయి. వందల ఎకరాల దేవాలయ భూములు అక్రమ కట్టడాలకు, సాగుకు గురవుతున్నా, దేవాదాయ శాఖ రికార్డుల్లో ఉన్న భూములను, కాపాడటంలో అధికారులు ఘోరంగా విఫలమవుతున్నారు.

వరుసగా ఫిర్యాదులు అందుతున్నా, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లోపించడం, కనీసం ఆలయాలకు సెక్యూరిటీ గార్డులను నియమించకపోవడం కానీ సిసి కెమెరాల ఏర్పాటుపై దృష్టి సారించకపోవడం, అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలుస్తోంది. ఇటు దొంగల భయం, అటు భూ ఆక్రమణలు, మధ్యలో గుప్తనిధుల తవ్వకాలతో, పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రాలు తమ ఉనికిని కోల్పోతుంటే, పాలనా యంత్రాంగం నిద్రపోతోందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.? ప్రభుత్వం, ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, ప్రత్యేక బృందాలతో దొంగలను పట్టుకోవాలని, ఆక్రమణకు గురైన దేవాలయ భూములను స్వాధీనం చేసుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుని, పెద్ద ఎత్తున ఆందోళనలకు దారితీస్తుందని భక్తులు హెచ్చరిస్తున్నారు..

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు