చిత్తూరు జిల్లా పుత్తూరు మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. భార్య, ఇద్దరు పిల్లలను కోల్పోయిన ఓ వ్యక్తి తీవ్ర మనోవేదనతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబాన్ని కోల్పోయిన బాధతో జీవితంపై విరక్తి పెంచుకున్న అతడు చివరకు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
పోలీసుల వివరాల ప్రకారం.. పుత్తూరు మండలానికి చెందిన శివశంకరరావు (30) భార్య పద్మ, ఇద్దరు పిల్లలు గత ఫిబ్రవరిలో మృతి చెందారు. కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో పద్మ తన ఇద్దరు పిల్లలను హతమార్చి అనంతరం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన కేసులో శివశంకరరావు జైలుకు వెళ్లగా, ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చాడు.
జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా భార్య, పిల్లల మరణాన్ని తలచుకుంటూ తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బుధవారం మామిడితోటలో ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు తన భార్య, పిల్లలు లేని జీవితాన్ని తాను భరించలేనంటూ బంధువులకు వాయిస్ మెసేజ్ పంపినట్లు పోలీసులు వెల్లడించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
also read: జమ్మలమడకలో విషాదం.. పాడుబడిన ఇంట్లో నవజాత ఆడ శిశువు మృతదేహం
