క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో : ఏపీలో మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఆయన కోడలు మేఘన తన తండ్రి అనంతకృష్ణ గౌడ్ తో కలిసి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిశారు. ఆమె ఈ కేసుకు సంబంధించి కొన్ని వీడియో ఆధారాలను గవర్నర్కు అందజేశారు. తన అత్తమామలు జోగి రమేష్, శకుంతల, తన భర్త రాజీవ్, ఇతర కుటుంబ సభ్యుల నుంచి.. తనతో పాటు తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు. తమకు వెంటనే రక్షణ కల్పించాలని.. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కోరారు. దీంతో ఈ అంశం కొత్త మలుపుకు దారితీసింది.
-
కొద్దిరోజులుగా రగడ..
గత కొద్ది రోజులుగా జోగి రమేష్ కుటుంబంలో కలహాలు రేగిన సంగతి తెలిసిందే. కోడలు మేఘన ఇబ్రహీంపట్నంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఇరుకు కుటుంబ సభ్యులకు సంబంధించి పంచాయితీ జరిగింది. అందులో కొన్ని వీడియోలు సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చాయి. కోడలు మేఘన బాహటంగానే మాట్లాడారు. తనకు జరిగిన అన్యాయంపై వివరించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు నేరుగా గవర్నర్కు ఫిర్యాదు చేశారు మేఘన. పెళ్లి సమయంలో ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు తన తల్లిదండ్రులు అంటూ చెప్పుకొచ్చారు మేఘన. ఏకంగా కిలోన్నర బంగారం, 10 కిలోల వెండి, తొమ్మిది లక్షల రూపాయల ఆడపడుచు కట్నం ఇచ్చిన విషయాన్ని చెప్పుచ్చారు. పెళ్లి తర్వాత అత్తమామలు ఐదు కోట్ల రూపాయల అదనపు కట్నం, ఖరీదైన కార్లు, వజ్రాల నెక్లెస్, వజ్రపు ఉంగరం తీసుకురావాలని వేధించారని మేఘన ఆరోపించారు. గోవా వెళ్ళినప్పుడు తనకు ఈత రాదని తెలిసినా వినలేదని.. తన భర్త రాజీవ్ తనను పడవపై నుంచి నీటిలోకి నెట్టేయడానికి ప్రయత్నించినట్లు చెప్పుకొచ్చారు. తనను ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటి టెర్రస్ పైనుంచి కిందకు తోసేయబోయారని ఆరోపించారు. ఘట్కేసర్ ఫామ్ హౌస్ లో దిండుతో ఊపిరి ఆడకుండా చేసి చంపే ప్రయత్నం కూడా జరిగిందని చెప్పుకొచ్చారు. చున్నీతో ఊపిరి ఆడకుండా చేసి తనపై దాడి కూడా చేశారని ఆరోపించారు.
-
వ్యక్తిగత భద్రత కల్పించండి..
ఇటీవల పరిణామాలు నేపథ్యంలో తనతో పాటు తన తల్లిదండ్రులకు జోగి రమేష్ కుటుంబం నుంచి ప్రాణహాని ఉందని మేఘన గవర్నర్కు ఫిర్యాదు చేశారు. తనకు వ్యక్తిగత భద్రత కల్పించాలని కోరారు. రాజకీయ ఒత్తిళ్లు లేకుండా, వేగంగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసేలా పోలీసులు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఆమె వినతిపై గవర్నర్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఏకంగా గవర్నర్ వరకు జోగి రమేష్ కుటుంబ పంచాయితీ వెళ్లడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇప్పటివరకు దీనిని రాజకీయ అంశంగా మార్చారు జోగి రమేష్. స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తో పాటు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పై ఆరోపణలు చేశారు. అయితే అది కుటుంబ వ్యవహారమని.. దాంట్లో రాజకీయ జోక్యం లేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అనవసరంగా కుటుంబ వివాదాలతో పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తున్నారని ఇప్పటికే జోగి రమేష్ పై జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు గవర్నర్ వరకు పంచాయితీ వెళ్లడంతో.. వైసీపీ హై కమాండ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
