క్రైమ్ మిర్రర్ : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ట్రాక్టర్ ట్రాలీలో ఉన్న ఇనుప కడ్డీలు బస్సు ముందు భాగాన్ని చీల్చుకుంటూ లోపలికి దూసుకొచ్చాయి. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. పది మందికిపైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
మాండ్య జిల్లాలోని వరాహసంద్ర గేట్ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్ఆర్టీసీ)కు చెందిన బస్సు ప్రయాణిస్తున్న సమయంలో ముందున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ట్రాక్టర్ ట్రాలీలో రవాణా చేస్తున్న ఇనుప రాడ్లు బస్సు ముందు అద్దాన్ని ఛేదించి ప్రయాణికుల వైపు దూసుకొచ్చాయి. ఈ క్రమంలో బస్సు డ్రైవర్ శేఖర్ శరీరంలోకి ఇనుప కడ్డీలు బలంగా దూసుకెళ్లడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు హాసన్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.
ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పది మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను బెల్లూరులోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి అసలు కారణం ఏమిటనే దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బస్సు ముందు భాగంలోకి ఇనుప కడ్డీలు చొచ్చుకెళ్లిన దృశ్యాలతో పాటు.. ప్రమాదంలో ధ్వంసమైన ట్రాక్టర్ వీడియోలు, ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
also read : బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు.. వేర్వేరు ఘటనల్లో ఇద్దరి దారుణ హత్య
