Homeక్రైమ్అబార్షన్ మాత్రలతో బాలిక మృతి..

అబార్షన్ మాత్రలతో బాలిక మృతి..

క్రైమ్ మిర్రర్ : అనధికారికంగా అబార్షన్ మాత్రలు తీసుకోవడంతో 17 ఏళ్ల బాలిక మృతి చెందిన విషాద ఘటన పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలంలో చోటుచేసుకుంది. వైద్యుల పర్యవేక్షణ లేకుండా గర్భస్రావం కోసం మందులు వినియోగించడంతో తీవ్ర రక్తస్రావం జరిగి ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. స్థానికుల వివరాల ప్రకారం.. అస్సాంకు చెందిన బాలిక బోయపాలెంలోని ఓ స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తోంది. గర్భం దాల్చిన ఆమె గర్భాన్ని కొనసాగించడం ఇష్టం లేక స్థానికంగా ఉన్న ఓ అనధికారిక మెడికల్ షాపు నుంచి అబార్షన్ కిట్లు కొనుగోలు చేసినట్లు సమాచారం.

వైద్యుల సలహా, పర్యవేక్షణ లేకుండానే ఇంట్లోనే కొన్ని రోజులపాటు ఆ మాత్రలను ఉపయోగించినట్లు తెలుస్తోంది. అనంతరం ఆమెకు తీవ్ర కడుపునొప్పితో పాటు భారీగా రక్తస్రావం ప్రారంభమైంది. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆటోలో చిలకలూరిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే ఆస్పత్రికి చేరుకునేలోపే ఆమె పరిస్థితి మరింత విషమించింది. ఆస్పత్రికి తీసుకెళ్లిన అనంతరం వైద్యులు పరీక్షించగా.. అధిక రక్తస్రావం, పల్మనరీ ఎంబోలిజం కారణంగా ఆమె మృతి చెందినట్లు నిర్ధారించినట్లు అధికారులు తెలిపారు.

ఘటనపై పోలీసులు మెడికో-లీగల్ కేసు నమోదు చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి తదుపరి దర్యాప్తు చేపట్టారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా అబార్షన్ కిట్లు విక్రయించిన మెడికల్ షాపు నిర్వాహకుడితో పాటు, ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న ఆర్‌ఎంపీ, పీఎంపీలపై కూడా చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

ఈ ఘటనపై పల్నాడు జిల్లా డీఎంహెచ్‌వో డాక్టర్ చుక్కా రత్నం మన్మోహన్ స్పందించారు. జిల్లాలో అనుమతులు లేకుండా అబార్షన్ కిట్లు విక్రయించడం, నిబంధనలకు విరుద్ధంగా గర్భస్రావాలు నిర్వహించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. వైద్య నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమతి లేని వ్యక్తుల వద్ద అబార్షన్ మందులు తీసుకోవడం ప్రమాదకరమని, ఇలాంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా అర్హత కలిగిన వైద్యులను సంప్రదించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.
also read : ఏసీబీకి చిక్కిన మరో అవినీతి అధికారి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు