Homeక్రైమ్ప్రమాదం కాదు.. పరువు కోసం కూతురిని హత్య చేసిన తండ్రి

ప్రమాదం కాదు.. పరువు కోసం కూతురిని హత్య చేసిన తండ్రి

క్రైమ్ మిర్రర : గుజరాత్‌లో జరిగిన ఓ యువతి మృతి కేసులో పోలీసులు సంచలన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు. తొలుత ఇది హిట్‌ అండ్‌ రన్‌ ప్రమాదంగా భావించినప్పటికీ, దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ అసలు విషయం బయటపడింది. యువతిని ఆమె తండ్రి, సోదరుడే పథకం ప్రకారం హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.

అహ్మదాబాద్‌కు చెందిన సోఫియా అనే యువతికి సంబంధించిన ఓ వీడియో మూడు నెలల క్రితం సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. ఆ వీడియో ఆమె తండ్రి మహ్మద్ ఫరూఖ్, సోదరుడు మహ్మద్ హాబిల్‌ కంటపడింది. దీంతో కుటుంబ పరువు పోతుందని భావించిన వారు సోఫియాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పోలీసులు తెలిపారు. చివరకు ఆమెను హతమార్చాలని నిర్ణయించుకున్నారని దర్యాప్తులో వెల్లడైంది.

ఆగస్టు 12 రాత్రి సోఫియాను బైక్‌పై తీసుకుని ఇద్దరూ గ్రామ శివార్లకు వెళ్లారు. గెల్జీపుర సమీపంలోని మట్టి రహదారి వద్దకు చేరుకున్న తర్వాత హాబిల్ ఇనుప రాడ్‌తో సోఫియాపై దాడి చేశాడు. ఆమె తలపై పలుమార్లు కొట్టడంతో తీవ్రంగా గాయపడింది. ఆ తర్వాత తండ్రీకొడుకులు ఆమెను ప్రధాన రహదారి వద్దకు తీసుకొచ్చి, ప్రమాదం జరిగినట్లుగా నమ్మించేందుకు బైక్‌ను ధ్వంసం చేశారు. అనంతరం హాబిల్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి గుర్తుతెలియని వాహనం తమ బైక్‌ను ఢీకొట్టి వెళ్లిపోయిందని ఫిర్యాదు చేశాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన సోఫియాను సోలా సివిల్ ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మరుసటి రోజు ఆమె మృతి చెందింది. మొదట హిట్‌ అండ్‌ రన్‌ కేసుగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆధారాలను పరిశీలించడంతో అనుమానాలు తలెత్తాయి. విచారణలో ప్రమాదం వెనుక అసలు కథ బయటపడింది. సోఫియాను ఆమె తండ్రి, సోదరుడే హత్య చేసి, దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించినట్లు పోలీసులు నిర్ధారించారు. దీంతో మహ్మద్ ఫరూఖ్, మహ్మద్ హాబిల్‌ను పోలీసులు అరెస్ట్ చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
also read : TET, విద్యాఅర్హతల్లేని వారిని ఉపాధ్యాయులుగా నియమించవద్దు: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు