క్రైమ్ మిర్రర్ : మహారాష్ట్రలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. గోండా సిటీ సమీపంలోని మహారాష్ట్ర–మధ్యప్రదేశ్ హైవేపై నగ్రా గ్రామం వద్ద బొలెరో వాహనం, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఏడుగురు గాయపడ్డారు. మధ్యాహ్నం సుమారు 12.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
మధ్యప్రదేశ్‌లోని కిర్నాపూర్, లాంజి తహసీల్ ప్రాంతాలకు చెందిన కొందరు కార్మికులు తమ కుటుంబ సభ్యులతో కలిసి బొలెరో వాహనంలో తెలంగాణకు బయలుదేరారు. హైదరాబాద్‌లో పని చేసేందుకు వారు వెళ్తున్నట్లు తెలుస్తోంది. నగ్రా గ్రామం వద్దకు చేరుకున్న సమయంలో ఎదురుగా వేగంగా వచ్చిన ట్రక్కు వారి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ట్రక్కు వేగం అధికంగా ఉండటంతో ఢీకొన్న తీవ్రత కూడా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద ధాటికి బొలెరో వాహనం పూర్తిగా ధ్వంసమై అందులో ప్రయాణిస్తున్న వారు తీవ్రంగా గాయపడ్డారు. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి పోలీసులకు, అధికారులకు సమాచారం అందించారు. అధికారులు చేరుకునేలోపే గ్రామస్థులు సహాయక చర్యలు ప్రారంభించారు. వాహనంలో తీవ్రంగా ఇరుక్కుపోయిన క్షతగాత్రులను బయటకు తీసేందుకు సహాయక బృందాలు ప్రత్యేక పరికరాలతో కారును కట్ చేయాల్సి వచ్చింది. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై పూర్తి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.
also read : చికిత్స కోసం పట్టుకోబోతే.. అధికారులకే చుక్కలు చూపించిన చిరుత
