క్రైమ్ మిర్రర్ : కర్ణాటకలోని దావణగెరె సమీపంలో చిరుతపులి రెస్క్యూ ఆపరేషన్ సమయంలో ఉత్కంఠభరిత ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిరుతను కాపాడేందుకు వెళ్లిన అటవీ సిబ్బందిపై అది ఒక్కసారిగా దాడికి ప్రయత్నించింది. అయితే అధికారులు అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది.
దావణగెరె సమీప జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న ఓ కారు ఢీకొనడంతో చిరుత తీవ్రంగా గాయపడింది. కదల్లేని స్థితిలో రోడ్డుపై పడిఉన్న చిరుతను గమనించిన స్థానికులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది ప్రత్యేక బృందంగా అక్కడికి చేరుకుని చిరుతను రక్షించే చర్యలు ప్రారంభించారు. దాన్ని సురక్షితంగా పట్టుకునేందుకు ట్రాంక్విలైజర్ డార్ట్ ప్రయోగించారు. అయితే మత్తు మందు పూర్తిగా ప్రభావం చూపకముందే చిరుత ఒక్కసారిగా అప్రమత్తమై రెచ్చిపోయింది.
అనూహ్యంగా ఓ అటవీ అధికారిపైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో అక్కడ కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అయితే సిబ్బంది ఏమాత్రం ఆందోళన చెందకుండా సమయస్ఫూర్తితో స్పందించి చిరుతను ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత చిరుతను సురక్షితంగా బంధించి సమీపంలోని పశువైద్యశాలకు తరలించారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిరుతకు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు అటవీ అధికారులు తెలిపారు.
also read : ఘోర రోడ్డు ప్రమాదం.. భర్త కళ్లముందే భార్య మృతి
