దేశీయ ప్యాసింజర్ వాహనాల మార్కెట్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు ఆధిపత్యం చెలాయించిన పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానాన్ని ఇప్పుడు ‘ఆల్టర్నేట్ ఫ్యూయెల్’ (ప్రత్యామ్నాయ ఇంధన) వాహనాలు వేగంగా ఆక్రమిస్తున్నాయి. ఈ మేరకు ‘ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్’ (FADA) వెల్లడించిన ఆగస్టు నెల వాహన విక్రయాల గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.తాజా సమాచారం ప్రకారం, ఆగస్టులో అమ్ముడైన మొత్తం ప్యాసింజర్ వాహనాల్లో సీఎన్జీ (CNG), హైబ్రిడ్ మరియు ఎలక్ట్రిక్ (EV) వాహనాల వాటా ఏకంగా 41.95 శాతానికి చేరింది. ఇదే సమయంలో సాంప్రదాయ పెట్రోల్, ఇథనాల్ ఆధారిత వాహనాల విక్రయాలు 40.85 శాతానికి మాత్రమే పరిమితమయ్యాయి. ప్రత్యామ్నాయ ఇంధన విభాగాన్ని పరిశీలిస్తే.. సీఎన్జీ వాహనాలు అత్యధికంగా 25.28 శాతం వాటాను దక్కించుకోగా, హైబ్రిడ్ మోడళ్లు 9 శాతం, పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ వాహనాలు (EV) 7.63 శాతం సేల్స్ నమోదు చేశాయి.
వైఎస్సార్సీపీకి బిగ్ షాక్: పార్టీకి రాజీనామా చేసిన విజయనగరం ZP ఛైర్మన్ చిన్న శ్రీను!
రోజురోజుకూ పెరిగిపోతున్న ఇంధన ధరల నేపథ్యంలో, వాహనాల నిర్వహణ ఖర్చు (Maintenance Cost) తక్కువగా ఉండటమే వినియోగదారులు ఆల్టర్నేట్ ఫ్యూయెల్ వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణమని తేలింది. దీనికితోడు పర్యావరణ స్పృహ పెరగడం, మైలేజ్ పరంగా సీఎన్జీ, హైబ్రిడ్ వాహనాలు మెరుగైన ప్రయోజనాలను ఇస్తుండటంతో రానున్న కాలంలో వీటి డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది.
