క్రైమ్ మిర్రర్, జాతీయం :- పెళ్లి అంటే హంగామా మామూలుగా ఉండదు. ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లు సరికొత్త వరవడిని సృష్టిస్తున్నాయి. పెళ్లికి ముందే పెద్ద ఎత్తున షూటింగులు, సెట్టింగ్స్ తో అదరగొడుతున్నారు. అయితే అటువంటి ప్రీ వెడ్డింగ్ షూట్ ఒక పెళ్లి నిలిచిపోవడానికి కారణమైంది. ఫ్రీ వెడ్డింగ్ సూట్ వల్ల పెళ్లి నిలిచిపోవడం ఏంటి అనుకుంటున్నారా.? అయితే ఆ వివరాలు చదివేయండి. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన ఒక 15 ఏళ్ల బాలికకు వివాహాన్ని నిశ్చయించారు. సాధారణంగా అయితే ఈ పెళ్లి జరగకూడదు. ఎందుకంటే బాలిక మైనర్ కావడంతో వివాహానికి ఇబ్బందులు ఉంటాయి. కానీ ఇరు కుటుంబాలు ఈ విషయాన్ని బయటికి తెలియనియకుండా వివాహం జరిపించాలని భావించారు. దీంతో యధావిధిగానే పెళ్లి ఏర్పాట్లు సాగుతున్నాయి. పెళ్లికి ముందు అందరూ మాదిరిగానే ఫ్రీ వెడ్డింగ్ షూట్ చేసుకోవాలని ఈ జంట భావించింది. అందులో భాగంగానే ఫోటోలు తీసుకుని, రీల్స్ తీసుకుంటూ ఫ్రీ వెడ్డింగ్ షూట్ అద్భుతంగా చేసుకున్నారు. అక్కడితో ఆగకుండా ఫ్రీ వెడ్డింగ్ షూట్ కు సంబంధించిన ఫోటోలు వీడియోలను సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశారు. ఇవి పెద్ద ఎత్తున వైరల్ కావడంతో పాటు అమ్మాయి చిన్నపిల్లలా కనిపించడంతో అధికారుల దృష్టికి కొందరు తీసుకువెళ్లారు. ఈ విషయాన్నీ గుర్తించిన జిల్లా కలెక్టర్ వివేక్ జాన్సన్ వెంటనే సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ వివాహంపై దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని సూచించడంతో.. వెంటనే అప్రమత్తమైన మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు ఈ పెళ్లికి సంబంధించి వివరాలను ఆరా తీయడం ప్రారంభించారు. అధికారులు తనకున్నట్లుగానే పెళ్లికూతురు వయసు 15 సంవత్సరాలుగా నిర్ధారణ అయింది. పెళ్లి కుమారుడు బీడ్ జిల్లా గెవరాయి మండలానికి చెందిన 23 ఏళ్ల యువకుడుగా అధికారులు గుర్తించారు. పెళ్లికూతురు మైనర్ కావడంతో వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. అమ్మాయి గ్రామానికి చేరుకొని వివరాలను సేకరించారు. అయితే వివాహం జరిగిన ఇంటి వద్దకు వెళ్లిన అధికారులకు షాక్ కలిగించే విషయాలు కనిపించాయి. అయితే అమ్మాయి చేతిపై వరుడు పేరుతో ఉన్న గోరింటాకు తప్ప వివాహం జరిగినట్లు ఎక్కడ ఆనవాలు కనిపించలేదు. దీంతో వివాహం జరగలేదని అధికారులు నిర్ధారించుకున్నారు. పెళ్లికి ముందు తీసుకున్న ఫోటో షూట్ ను పరిగణలోకి తీసుకొని తదుపరి ఏర్పాట్లను అడ్డుకున్నారు మైనర్ బాలికను సంరక్షణలో తీసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. అయితే పెళ్లి నిలిపివేయడానికి కారణం ఉన్నతాధికారులు దృష్టికి విషయం వెళ్లిందన్న సమాచారం ఇరు కుటుంబాలకు తెలియడమేనని చెబుతున్నారు. వివాహం జరిగితే న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్న ఉద్దేశంతో పెళ్లిని ఇరు కుటుంబాలు నిలిపివేశాయి. దీంతో వివాహం జరగలేదని చెబుతున్నారు. అధికారులు కూడా అక్కడకు చేరుకునే వివాహం జరగలేదు అని నిర్ధారించుకున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ అమ్మాయిని మాత్రం అధికారులు హోమ్ కు తరలించారు. కలెక్టర్ ఆదేశాలతో యంత్రాంగం అప్రమత్తం కావడంతో మైనర్ వివాహం నిలిపివేయడం సాధ్యపడింది. దీంతో ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఫ్రీ వెడ్డింగ్ షూట్ కాస్త పెళ్లి నిలిచిపోవడానికి కారణమైనదంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.