Homeతెలంగాణచంచల్‌గూడ జైల్లో 'ఫీల్ ది జైల్'.. డబ్బులు కట్టి ఖైదీగా మారొచ్చు, టికెట్ ధర ఎంతంటే..?

చంచల్‌గూడ జైల్లో ‘ఫీల్ ది జైల్’.. డబ్బులు కట్టి ఖైదీగా మారొచ్చు, టికెట్ ధర ఎంతంటే..?

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : చాలా మందికి జైలు జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఉత్సాహం ఉంటుంది. అంటువంటి వారి కోసం తెలంగాణ టూరిజం డిపార్ట్‌మెంట్ దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒక సరికొత్త, వినూత్నమైన ప్రయోగానికి తెరలేపింది. హైదరాబాద్ నగరానికి వచ్చే దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు సాధారణంగా చార్మినార్, గోల్కొండ కోట, సాలార్ జంగ్ మ్యూజియం వంటి చారిత్రక కట్టడాలను ప్రమోట్ చేసే పర్యాటక శాఖ.. ఇప్పుడు ఈ జాబితాలోకి జైలు శిక్ష అనుభూతి ని కూడా చేర్చింది. హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న చారిత్రాత్మక చంచల్‌గూడ కేంద్ర కారాగారంలో ఇటీవల ప్రారంభించిన ‘ఫీల్ ది జైల్’ కార్యక్రమాన్ని ప్రమోట్ చేయాలని రాష్ట్ర పర్యాటక శాఖ నిర్ణయం తీసుకుంది.

జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్య మిశ్రా పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావడంతో ఈ వినూత్న టూరిజం ప్రాజెక్టు పట్టాలెక్కింది. ప్రస్తుతం ఉన్న 12 గంటలు, 24 గంటల ప్యాకేజీలతో పాటు.. తక్కువ సమయం మాత్రమే గడపాలనుకునే వారి కోసం 4 గంటలు, 8 గంటల ప్యాకేజీలను కూడా కొత్తగా ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ విషయమై డీజీ సౌమ్య మిశ్రా మాట్లాడుతూ.. పర్యాటక శాఖ తన టూరిజం జాబితాలో చంచల్‌గూడ జైలును చేర్చినందున.. రాబోయే రోజుల్లో సందర్శకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

పర్యాటకులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సులభంగా జైలు గదులను బుక్ చేసుకునేందుకు వీలుగా ఒక ప్రముఖ ఆన్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్, టికెటింగ్ ప్లాట్‌ఫారమ్ ద్వారా రిజర్వేషన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. నిజానికి, చంచల్‌గూడ జైలు కేవలం ఒక సాధారణ కారాగారం మాత్రమే కాదు.. దానికి ఒక గొప్ప చారిత్రక నేపథ్యం ఉంది. నిజాం రాజుల కాలంలో.. అంటే 1912 సంవత్సరంలో నిర్మించిన ఈ పురాతన భవన సముదాయం అద్భుతమైన నిర్మాణ శైలిని కలిగి ఉంటుంది. ఈ చారిత్రక ప్రాంగణాన్ని పాడుచేయకుండా, పర్యాటకులకు నిజమైన జైలు వాతావరణం, ఖైదీల జీవన విధానంపై పూర్తి అవగాహన, అనుభూతిని అందించేలా దీనిని లగ్జరీ వసతులతో కాకుండా.. అసలైన జైలు రూపురేఖలతోనే అభివృద్ధి చేశారు.

ఈ ‘ఫీల్ ది జైల్’ ప్యాకేజీని ఎంచుకునే సందర్శకులు జైలు నిబంధనలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. లోపలికి ప్రవేశించగానే వారికి సాధారణ ఖైదీలు ధరించే జైలు యూనిఫారాలను ఇస్తారు, బస చేసినంత కాలం వాటినే ధరించాలి. ఒక రోజంతా జైలు సెల్‌లో గడిపేందుకు గాను రూ. 2 వేలు రుసుముగా నిర్ణయించారు. ఖైదీలకు పెట్టే ఉదయం చాయ్, టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనాన్ని కూడా పర్యాటకులకు అందిస్తారు. కేవలం పర్యాటకులకే కాకుండా.. రాబోయే రోజుల్లో పాఠశాల విద్యార్థులకు కూడా జైలు నిబంధనలు, చట్టాలపై అవగాహన కల్పించేలా విద్యా పర్యటనల కింద చంచల్‌గూడ జైలును సందర్శించేందుకు అనుమతించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సరికొత్త టూరిజం కాన్సెప్ట్ హైదరాబాద్ పర్యాటక రంగంలో కీలకంగా మారుతుందని అధికారులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు