-
కూటమి ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఏర్పాట్లు
-
238 పుష్కర ఘాట్లు
-
పాతవాటి ఆధునీకరణ, కొత్త వాటి నిర్మాణం
-
ఈసారి డిజిటల్ సేవలు
-
గత అనుభవాల దృష్ట్యా భద్రతకు పెద్దపీట
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: గోదావరి పుష్కరాలకు తెలుగు రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు నిర్వహించేందుకు ప్రభుత్వాలు సిద్ధపడుతున్నాయి. అత్యాధునిక సాంకేతిక వసతులతో 2027 గోదావరి పుష్కరాలను నిర్వహించేందుకు ఏపీలో కూటమి ప్రభుత్వం సన్నాహాలు మరింత ముమ్మరం చేసింది.
దక్షిణాది మహా కుంభమేళాగా భావించే ఈ పుష్కరాలకు కోట్ల సంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. గ్లోబల్ స్టాండర్డ్స్ కు తగినట్టు ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకుగాను భారీగా ఖర్చు చేస్తోంది. మొత్తం అంచనా వ్యయం రూ.8500 కోట్లు కాగా.. తొలి విడత మౌలిక వసతులు, ఘాట్ల విస్తరణ పనుల నిమిత్తం ప్రభుత్వం ఇప్పటివరకు రూ. 530 కోట్లను అధికారికంగా మంజూరు చేసింది.
-
శాఖల వారిగా నిధుల కేటాయింపు…
గోదావరి నది తీరం పొడవున 238 పుష్కర్ ఘాట్ల నిర్మాణం చేస్తోంది ఏపీ ప్రభుత్వం. శాఖల వారీగా నిధుల కేటాయింపు పై దృష్టి పెట్టింది. అయితే పాత పుష్కర ఘాట్లతో పాటు కొత్త వాటి నిర్మాణం కూడా జరపనుంది. పాతవాటికి ఆధునీకరణ, మరమ్మత్తులు, నిర్మాణాలు చేపడుతున్న నీటిపారుదల శాఖకు అత్యధికంగా రూ. 210.6 కోట్లు కేటాయించారు.
పట్టణ మౌలిక వసతులు, పారిశుద్ధ్య నిర్వహణ పనుల నిమిత్తం పురపాలిక పట్టణాభివృద్ధి శాఖకు రూ.150 కోట్లు, గోదావరి తీరంలో నిరంతర విద్యుత్ సరఫరా, తాత్కాలిక సబ్స్టేషన్ల ఏర్పాటుకు ఇంధన శాఖకు రూ.100 కోట్లు కేటాయించారు. వీటితోపాటు ఆలయాల సుందరీకరణ, ధార్మిక కార్యక్రమాల నిర్వహణకు దేవాదాయ శాఖకు రూ.60 కోట్లు, పర్యాటక సేవలు, సాంస్కృతిక ప్రదర్శనల కోసం 10 కోట్ల రూపాయలను విడుదల చేశారు.
-
డిజిటల్ టెక్నాలజీ..
గత అనుభవాల దృష్ట్యా మరోసారి అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోంది. డిజిటల్ టెక్నాలజీ వినియోగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. లక్షలాదిమంది భక్తులు ఒకేసారి వచ్చే అవకాశం ఉన్నందున క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సిసిటీవీ నెట్వర్క్, డ్రోన్ సర్వై లైన్స్, రియల్ టైం కంట్రోల్ రూమ్ లను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు.
పుష్కర స్నానాలకు సంబంధించి ఘాట్లు, స్లాట్ బుకింగ్, ట్రాఫిక్ రూట్ మ్యాప్స్, అందుబాటులో ఉన్న పార్కింగ్ స్థలాలు, అత్యవసర వైద్య సేవల సమాచారాన్ని సులువుగా తెలుసుకునేలా ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్ ను, యువర్ కోడ్ నావిగేషన్ సిస్టంను అందుబాటులోకి తీసుకురానున్నారు.
-
నీరు కలుషితం కాకుండా..
ప్రధానంగా ప్రభుత్వం నది జలాలు కలుషితం కాకుండా చూడాలని చూస్తోంది. పరిశుభ్రతతో పాటు పర్యావరణ పరిరక్షణకు పెద్దపీటవేస్తోంది. నదిలో నీరు కలుషితం కాకుండా ప్రత్యేక ఫెడరేషన్ గ్రిడ్లను ఏర్పాటు చేస్తోంది. ప్లాస్టిక్ రహిత పుష్కరాలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతోంది. ప్రతిఘాట్ వద్ద 24 గంటలు అందుబాటులో ఉండేలా మొబైల్ మెడికల్ టీంలు, అంబులెన్స్లు, పారిశుధ్య సిబ్బంది, స్విమ్మింగ్ నిపుణులను అందుబాటులో ఉంచనున్నారు.
భక్తుల రద్దీని నియంత్రించేందుకు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు వేగంగా పనిచేసేలా ఏర్పాటు చేయనున్నారు.. మొత్తానికి అయితే గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఏర్పాట్లు చేస్తుండడం విశేషం
