Homeజాతీయంచిరంజీవితో తెలంగాణ స్టేట్ బీజేపీ చీఫ్ భేటీ.. పొలిటికల్ సర్కిల్‌లో జోరుగా చర్చ!!

చిరంజీవితో తెలంగాణ స్టేట్ బీజేపీ చీఫ్ భేటీ.. పొలిటికల్ సర్కిల్‌లో జోరుగా చర్చ!!

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు, మెగాస్టార్ చిరంజీవితో భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్ రావు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశం జరిగిన కొద్దిసేపటికే అందుకు సంబంధించిన ఫోటోలు బయటకు రావడంతో అటు పొలిటికల్ సర్కిల్‌లో, ఇటు సోషల్ మీడియా వేదికల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. గత కొన్నేళ్లుగా ప్రత్యక్ష రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటూ.. కేవలం సినిమాలకే పరిమితమైన మెగాస్టార్ చిరంజీవిని బీజేపీ ముఖ్య నేత కలవడం వెనుక ఉన్న అసలు కారణాలపై రకరకాల విశ్లేషణలు మొదలయ్యాయి.

అయితే, ఈ భేటీ వెనుక ఉన్న కారణాన్ని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం విజయవంతంగా 12 ఏళ్ల సుదీర్ఘ పాలనను పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బీజేపీ దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ‘మహాజన్ సంపర్క్ అభియాన్’ పేరిట ఒక ప్రత్యేక ప్రజా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. మోదీ ప్రభుత్వం సాధించిన చారిత్రాత్మక విజయాలు, దేశ రక్షణ, ఆర్థిక రంగాల్లో తీసుకొచ్చిన మార్పులు, అమలు చేసిన సంక్షేమ పథకాలను సమాజంలోని వివిధ రంగాల ప్రముఖులకు వివరించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగానే రామచందర్ రావు మెగాస్టార్‌ను కలిసి.. మోదీ 12 ఏళ్ల పాలనా ప్రగతికి సంబంధించిన ఒక స్పెషల్ బుక్, బ్రోచర్లను చిరంజీవికి అందజేశారు.

ఈ సందర్భంగా దేశ ఆర్థిక పురోగతి, వివిధ రంగాల అభివృద్ధిపై ఇరు ప్రముఖుల మధ్య కాసేపు ఆసక్తికర చర్చ సాగినట్లు సమాచారం. ఈ సమావేశం కేవలం మర్యాదపూర్వకమైనదని, ప్రభుత్వ విజయాలను వివరించడానికే తాము మెగాస్టార్‌ను కలిశామని బీజేపీ నేతలు పైకి చెప్తున్నప్పటికీ.. అంతర్గతంగా మాత్రం రాజకీయ సమీకరణాల చర్చ జోరందుకుంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఆ తర్వాత కాంగ్రెస్‌లో విలీనం చేసి కేంద్ర మంత్రిగా పనిచేసిన చిరంజీవికి రాజకీయాలపై అపారమైన అనుభవం ఉంది. ఆ తర్వాత ఆయన పాలిటిక్స్‌కు గుడ్ బై చెప్పి మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యారు. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న చిరు.. ఈ భేటీ ద్వారా మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్‌లోకి రీ-ఎంట్రీ ఇస్తారా..? ఒకవేళ వస్తే కాషాయ జెండా కప్పుకునే అవకాశం ఉందా? అనే ఊహాగానాలు జోరందుకున్నాయి.

ఈ చర్చకు మరో ప్రధాన కారణం.. చిరంజీవి తమ్ముడు, జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే కేంద్రంలోని ఎన్డీయే కూటమిలో కీలకమైన భాగస్వామిగా కొనసాగుతున్నారు. అటు ఏపీ ప్రభుత్వంలోనూ భాగస్వామిగా ఉన్నారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ మోదీ ప్రభుత్వంతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న నేపథ్యంలో.. తాజా రాజకీయ సమీకరణాలు అన్న చిరంజీవిని కూడా బీజేపీ వైపు ఆకర్షిస్తున్నాయా? అనే కోణంలో విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఇది మర్యాదపూర్వక భేటీనా.. లేక ఇటు బీజేపీకి, అటు చిరంజీవికి మైలేజ్ ఇచ్చే సమావేశమా? అనేది తేలాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు