క్రైమ్ మిర్రర్ : నాగర్‌కర్నూల్ జిల్లాలో నకిలీ రూ.500 నోట్లను తయారు చేసి చలామణి చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు నాగర్‌కర్నూల్ డీఎస్పీ బుర్రి శ్రీనివాస్ వెల్లడించారు. బిజినేపల్లి పోలీస్ స్టేషన్‌లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ కేసు వివరాలను వెల్లడించారు. బిజినేపల్లి మండలం మంగనూరు గ్రామానికి చెందిన గొల్ల కురుమూర్తి, వంగ నవీన్ గౌడ్ నకిలీ రూ.500 నోట్లను తీసుకుని స్థానిక వైన్స్ వద్దకు వెళ్లినట్లు తెలిపారు.
వైన్స్ దుకాణంలో రెండు రూ.500 నోట్లు ఇచ్చి మద్యం కొనుగోలు చేసేందుకు ప్రయత్నించగా, వాటిని పరిశీలించిన దుకాణ యజమాని అవి నకిలీ నోట్లని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో కేసు దర్యాప్తు ప్రారంభమైంది. ఇప్పటికే కురుమూర్తిపై అనుమానంతో నిఘా పెట్టిన పోలీసులు, అతని ఇంటి వద్ద కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు గుర్తించారు. దీంతో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి తనిఖీలు చేపట్టగా, నకిలీ కరెన్సీ తయారీకి సంబంధించిన సామగ్రి బయటపడినట్లు తెలిపారు.
దర్యాప్తులో భాగంగా నిందితులను విచారించగా, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నాగరాజు అనే వ్యక్తి మీసేవా కేంద్రంలో నకిలీ నోట్లను తయారు చేసినట్లు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేయగా, మరో ఎనిమిది మంది పరారీలో ఉన్నారని చెప్పారు. నిందితులపై నకిలీ పత్రాలు, మోసం, నకిలీ కరెన్సీ చలామణికి సంబంధించిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టినట్లు తెలిపారు.
also read : ఇన్‌స్టాగ్రామ్ పరిచయం.. బాలిక కిడ్నాప్ కేసులో యువకుడి అరెస్ట్
