ఆదిలాబాద్ పట్టణంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కేవలం 24 గంటల వ్యవధిలో భార్యాభర్తలు ఇద్దరూ మృతి చెందడంతో వారి పదేళ్ల కుమారుడు తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మిగిలాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
పట్టణంలోని పిట్టలవాడకు చెందిన నైతం నవీన్ కుమార్ (33) స్థానిక ఎక్సైజ్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన భార్య లత (31). ఈ దంపతులకు పదేళ్ల కుమారుడు ఉన్నాడు.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న లతకు పచ్చకామెర్ల వ్యాధి సోకినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో జగిత్యాలలో చికిత్స తీసుకున్నారు. చికిత్స అనంతరం శుక్రవారం తిరిగి ఆదిలాబాద్‌కు వస్తుండగా మార్గమధ్యంలోనే ఆమె మృతి చెందారు. శనివారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో లత అంత్యక్రియలు నిర్వహించారు.
భార్య మరణంతో నవీన్ కుమార్ తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయారు. ఇప్పటికే కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇంటి వద్దే ఉంటున్న ఆయన.. శనివారం రాత్రి సుమారు 8:30 గంటల సమయంలో మృతి చెందారు. భార్య అంత్యక్రియలు జరిగిన కొన్ని గంటల్లోనే భర్త కూడా ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
భార్య మృతిని తట్టుకోలేక తీవ్ర మనోవేదనకు గురైన నవీన్ కుమార్ గుండె ఆగిపోవడం వల్లే మృతి చెంది ఉండొచ్చని స్థానికులు, బంధువులు భావిస్తున్నారు. అయితే మృతికి సంబంధించిన పూర్తి కారణాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.
ఇక ఒకే రోజు తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన పదేళ్ల బాలుడి పరిస్థితి అందరినీ కలచివేసింది. తల్లిదండ్రుల మృతదేహాల వద్ద బాలుడు కన్నీరుమున్నీరుగా విలపించిన దృశ్యాలు అక్కడున్న వారిని కంటతడి పెట్టించాయి. చిన్నారిని ఓదార్చేందుకు ప్రయత్నించిన కుటుంబ సభ్యులు, బంధువులు సైతం తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ ఘటనతో పిట్టలవాడలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
also read: విజయ్ దేవరకొండకు బాలాపూర్ గణనాథుడి దర్శనం.. ‘విజయ్ అన్న’ నినాదాలతో హోరెత్తిన మండపం
