ప్రపంచవ్యాప్తంగా వినోద రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ది వాల్ట్ డిస్నీ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థ చరిత్రలో తొలిసారిగా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (CTO) అనే కొత్త పదవిని ఏర్పాటు చేసింది. ఈ బాధ్యతలను భారత సంతతికి చెందిన ప్రముఖ టెక్నాలజీ నిపుణుడు కరణ్‌దీప్ ఆనంద్‌కు అప్పగించింది.
డిస్నీ ప్రకటించిన వివరాల ప్రకారం.. కరణ్‌దీప్ ఆనంద్ అక్టోబర్ 2 నుంచి సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన నేరుగా కంపెనీ సీఈవో జోష్ డీఅమారోకు రిపోర్ట్ చేయనున్నారు.
కంపెనీ వ్యాప్తంగా సాంకేతిక వ్యవస్థలను మరింత ఆధునికీకరించడం కరణ్‌దీప్ ప్రధాన బాధ్యతల్లో ఒకటి. ఎంటర్ప్రైజ్ టెక్నాలజీతో పాటు డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్లాట్‌ఫామ్స్, ఇంజినీరింగ్ విభాగాలను కూడా ఆయన పర్యవేక్షించనున్నారు. కథనం, సృజనాత్మకతకు సాంకేతికతను జోడించడం, సంస్థలోని వివిధ విభాగాలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లడం వంటి లక్ష్యాల్లో భాగంగా డిస్నీ ఈ కొత్త పదవిని ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
హైదరాబాద్‌లో చదువు.. దిగ్గజ సంస్థల్లో అనుభవం
కరణ్‌దీప్ ఆనంద్‌కు టెక్నాలజీ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉంది. హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT-H)లో కంప్యూటర్ సైన్స్ అభ్యసించారు. అనంతరం ప్రముఖ టెక్ సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు.
మైక్రోసాఫ్ట్‌లో దాదాపు 15 ఏళ్ల పాటు పనిచేసిన ఆయన.. అజ్యూర్ క్లౌడ్ ప్లాట్‌ఫామ్ అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషించారు. ఆ తర్వాత మెటా (ఫేస్బుక్)లో వైస్ ప్రెసిడెంట్‌గా సేవలందించారు. ఇటీవల జనరేటివ్ ఏఐ ఆధారిత చాట్‌బాట్ సంస్థ క్యారెక్టర్.ఏఐకి సీఈవోగా వ్యవహరించారు.
కరణ్‌దీప్ నియామకంపై డిస్నీ సీఈవో జోష్ డీఅమారో మాట్లాడుతూ.. ఇన్ఫ్రాస్ట్రక్చర్, కన్జ్యూమర్ టెక్నాలజీ, ఏఐ రంగాల్లో ఆయనకు విస్తృత అనుభవం ఉందని పేర్కొన్నారు. డిస్నీ అభిమానుల అవసరాలను అర్థం చేసుకుని, వారికి అనుగుణంగా సాంకేతికతను ఉపయోగించడంలో కరణ్‌దీప్ కీలకంగా వ్యవహరించగలరని తెలిపారు.
మరోవైపు ఈ నియామకంపై కరణ్‌దీప్ ఆనంద్ కూడా స్పందించారు. చిన్నప్పటి నుంచే డిస్నీ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఇప్పుడు అదే సంస్థలో కీలక బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందని వెల్లడించారు.
డిస్నీ-క్యారెక్టర్.ఏఐ మధ్య గతంలో వివాదం
కరణ్‌దీప్ నియామకానికి సంబంధించి మరో ఆసక్తికరమైన అంశం కూడా ఉంది. ఆయన గతంలో సీఈవోగా పనిచేసిన క్యారెక్టర్.ఏఐపై డిస్నీ గతంలో అభ్యంతరం వ్యక్తం చేసింది. డిస్నీకి చెందిన ఎల్సా, మోయానా వంటి కాపీరైట్ పాత్రలను అనుమతి లేకుండా ఉపయోగిస్తున్నారంటూ 2025 సెప్టెంబర్‌లో క్యారెక్టర్.ఏఐకి లీగల్ నోటీసులు పంపినట్లు సమాచారం.
ఆ తర్వాత క్యారెక్టర్.ఏఐ తన ప్లాట్‌ఫామ్ నుంచి ఆ పాత్రలను తొలగించింది. ఇప్పుడు అదే సంస్థకు గతంలో నాయకత్వం వహించిన కరణ్‌దీప్ ఆనంద్‌ను డిస్నీ తన తొలి కంపెనీ-వైడ్ సీటీవోగా నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మార్చి 2026లో జోష్ డీఅమారో డిస్నీ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సంస్థలో టెక్నాలజీకి మరింత ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలోనే కంపెనీ స్థాయిలో కొత్త సీటీవో పదవిని ఏర్పాటు చేసి, దానికి కరణ్‌దీప్ ఆనంద్‌ను ఎంపిక చేసినట్లు డిస్నీ ప్రకటించింది.
also read: ఆదిలాబాద్‌లో విషాదం.. 24 గంటల్లోనే భార్యాభర్తల మృతి, అనాథగా పదేళ్ల కుమారుడు
