క్రైమ్ మిర్రర్ : నారాయణపేట్ మండలంలోని ఎక్లాస్‌పూర్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో విషాద ఘటన చోటుచేసుకుంది. పాఠశాలకు చదువుకోడానికి వెళ్లిన ఓ మూడో తరగతి విద్యార్థి పాము కాటుకు గురై చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపగా, విద్యార్థి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం ప్రకారం, ఎక్లాస్‌పూర్ గ్రామానికి చెందిన పిచ్చకుంట్ల రంజిత్ కుమార్ (మూడో తరగతి) గురువారం ఉదయం ఎప్పటిలాగే ప్రభుత్వ పాఠశాలకు వెళ్లాడు. తరగతి గదిలో కిటికీ సమీపంలో కూర్చున్న సమయంలో బయట నుంచి లోపలికి వచ్చిన నాగుపాము అతడిని కాటేసింది.
దీంతో విద్యార్థి అస్వస్థతకు గురికావడంతో ఉపాధ్యాయులు వెంటనే అప్రమత్తమై అతడిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో రంజిత్ కుమార్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రభుత్వ పాఠశాల పరిసరాల్లో పరిశుభ్రత లేకపోవడం, పొదలు, చెత్త పేరుకుపోవడం వల్ల పాములు తరచూ పాఠశాల ఆవరణలోకి వస్తున్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. పాఠశాల భద్రతపై నిర్లక్ష్యం కారణంగానే ఈ విషాదం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పాఠశాల పరిసరాలను వెంటనే శుభ్రపరచడంతో పాటు విద్యార్థుల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని కోరుతున్నారు.
also read : ఇటుకల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా.. ట్రాలీ కింద పడి యువకుడు మృతి
