క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీలో ఈరోజు (సోమవారం) పర్యటిస్తున్నారు. రెండు రోజుల పాటు ఢిల్లీలోనే సీఎం ఉండనున్నారు. పలు కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్ బిజీ బిజీగా ఉంది. మెట్రో ఫేజ్-1 రీఫైనాన్సింగ్ వివాదంపై కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు సీఎం సిద్ధమయ్యారు. మెట్రో ఫేజ్-2 విస్తరణ సమస్యలపై కేంద్రమంత్రులతో వరుసగా భేటీ కానున్నారు. ఐఆర్ఎఫ్సీ లోన్ విడుదల జాప్యంపై ప్రత్యక్ష చర్చలకు సీఎం సిద్ధం కానున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీ సహా మెట్రో విస్తరణ కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర నిధులు, ప్రాజెక్టులపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు.
యాసంగి ధాన్యం కొనుగోలు కోటా మరో 20 లక్షల టన్నులు పెంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేయనున్నారు. రైతులకు యూరియా కొరత రాకుండా ముందస్తు సరఫరా కోరనున్నారు. రామగుండం యూరియా ఉత్పత్తి మొత్తాన్ని తెలంగాణకే కేటాయించాలని విజ్ఞప్తి చేయనున్నారు. రాయదుర్గం భూముల వ్యవహారంలో ఎస్‌బీఐ తీరుపై కేంద్రానికి ఫిర్యాదు చేయనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి, ఆర్బీఐ గవర్నర్ దృష్టికి ఈ అంశాలను తీసుకెళ్లనున్నారు. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ఖర్గే, కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీలతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ కానున్నారు. మంత్రివర్గ విస్తరణ, శాఖల మార్పులపై హైకమాండ్‌తో చర్చించే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై సీఎం రేవంత్‌రెడ్డి ఒత్తిడి పెంచనున్నారు