తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగుల సంక్షేమం దిశగా చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPF) బకాయిల విడుదల కోసం ఆర్థిక శాఖ రూ.1,000 కోట్ల నిధులను మంజూరు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 2025 అక్టోబర్ నాటికి పేరుకుపోయిన క్లెయిమ్‌లను ఈ నిధులతో పూర్తిగా పరిష్కరించనున్నారు. ఈ నిర్ణయం వల్ల ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వేలాది మంది మాజీ ఉద్యోగుల కుటుంబాలకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరనుంది.
బకాయిల చెల్లింపులో జాప్యంపై ఇటీవల హైకోర్టు వ్యక్తం చేసిన అసహనం నేపథ్యంలో ప్రభుత్వం వేగంగా స్పందించింది. రాబోయే 100 రోజుల్లో విశ్రాంత ఉద్యోగుల క్లెయిమ్‌ల నిమిత్తం సుమారు రూ.6,200 కోట్లు చెల్లించాలని మంత్రివర్గం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిధుల సమీకరణ బాధ్యతను ‘రెవెన్యూ రిసోర్సెస్ మొబిలైజేషన్ కమిటీ’కి అప్పగించారు. రాష్ట్ర ఆర్థిక వనరులను పెంచుతూనే ఉద్యోగుల హక్కులను కాపాడాలని సర్కారు భావిస్తోంది.
ప్రభుత్వం తీసుకున్న మరో సంచలన నిర్ణయం ప్రకారం మంత్రులు ప్రజాప్రతినిధుల జీతాల్లో 50 శాతం నిలుపుదల చేసి ఆ మొత్తాన్ని రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల కోసమే మళ్లించనున్నారు. కేవలం పాత బకాయిలే కాకుండా భవిష్యత్తులో చెల్లింపుల ప్రక్రియ వేగవంతం చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతి నెలా చేసే చెల్లింపుల పరిమితిని మరో రూ.1,000 కోట్లకు పెంచుతూ ఆర్థిక శాఖ తీసుకున్న నిర్ణయం వల్ల బిల్లులు పెండింగ్‌లో ఉండకుండా ఎప్పటికప్పుడు పరిష్కారమవుతాయి.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుంటూనే ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వడం పట్ల ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం తమలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని వారు పేర్కొంటున్నారు. రిటైర్డ్ ఉద్యోగుల ఆర్థిక భద్రతకు భరోసా కల్పిస్తూ తీసుకున్న ఈ అడుగు రాష్ట్ర పరిపాలనలో కీలకమైన మార్పుగా కనిపిస్తోంది.
ALSO READ: హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్…ముంబైకీ కేవలం 3గంటల్లోనే…!