ఉత్తరప్రదేశ్‌లో జౌన్పూర్ జిల్లాలోని బన్‌పుర్వా ప్రాథమిక పాఠశాలలో జరిగిన ఓ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పాఠశాల సమయం ముగిసిన తరువాత, రెండో తరగతి చదువుతున్న ఓ చిన్నారి తరగతి గదిలోనే ఉండిపోయాడు. అయితే దీనిని గమనించకుండా సంబంధిత టీచర్ గది తాళం వేసి వెళ్లిపోయారు. గదిలో ఒంటరిగా బంధించబడిన బాలుడు భయంతో ఏడుస్తూ గడిపాడు.
సుమారు గంటన్నర తర్వాత, పాఠశాల వద్ద నుంచి వినిపించిన బాలుడి అరుపులు గమనించిన స్థానికులు వెంటనే స్పందించారు. వారు ఈ విషయాన్ని పాఠశాల సిబ్బందికి తెలియజేయగా, అసిస్టెంట్ టీచర్ అక్కడికి చేరుకుని తాళం తీసి బాలుడిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
ఈ ఘటనపై బాలుడి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారుల భద్రతపై ఇలాంటి నిర్లక్ష్యం అస్సలు సహించబోమని వారు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న విద్యాశాఖ అధికారులు వెంటనే విచారణ ప్రారంభించి, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన టీచర్‌ను సస్పెండ్ చేశారు.
also read: జూలూరుపాడు చెక్‌పోస్ట్‌లో గంజాయి పట్టివేత – ముగ్గురు అరెస్ట్, కేసు నమోదు