HomeUncategorizedహైదరాబాద్‌లో తాగు నీటి వృథాపై కఠిన చర్యలు.. రూ.20 వేల వరకు జరిమానా

హైదరాబాద్‌లో తాగు నీటి వృథాపై కఠిన చర్యలు.. రూ.20 వేల వరకు జరిమానా

హైదరాబాద్ నగరంలో తాగునీటి వృథాను అరికట్టేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWSSB) తనిఖీలను ముమ్మరం చేసింది. తాగునీటిని వాహనాలు కడగడం, ఫ్లోర్‌లు శుభ్రం చేయడం వంటి అవసరాలకు వినియోగిస్తున్న వారిపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సోమవారం జూబ్లీహిల్స్ ప్రాంతంలో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ఐదుగురు వినియోగదారులకు జరిమానాలు విధించారు.

ఇళ్లలో నీటి ట్యాంకులు నిండిపోయిన తర్వాత కూడా నల్లాలు మూసివేయకుండా నీరు వృథా చేయడం, తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగించడం వంటి వాటిని అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. గతంలో అవగాహన కల్పించడం, హెచ్చరికలు జారీ చేయడంతో సరిపెట్టిన జలమండలి.. పరిస్థితిలో మార్పు కనిపించకపోవడంతో జరిమానాలను కఠినతరం చేసింది.

నిబంధనల ఉల్లంఘన తీవ్రతను బట్టి రూ.1,000 నుంచి రూ.5,000, రూ.10,000 వరకు జరిమానాలు విధిస్తున్నారు. తీవ్రమైన ఉల్లంఘనలకు గరిష్ఠంగా రూ.20,000 వరకు ఫైన్ వేస్తున్నారు. పదేపదే నీటిని వృథా చేసే వినియోగదారులపై మరింత కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే నల్లా కనెక్షన్‌ను శాశ్వతంగా తొలగిస్తామని అధికారులు హెచ్చరించారు.

ఇటీవల జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 23లో ఫ్లోర్ క్లీనింగ్ కోసం తాగునీటిని ఉపయోగించిన పూర్ణిమ అనే వినియోగదారురాలికి రూ.20 వేల జరిమానా విధించారు. దీంతో నీటి వృథాపై జలమండలి ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో స్పష్టమవుతోంది.

నగరం మొత్తం తనిఖీలు

జూబ్లీహిల్స్‌కే పరిమితం కాకుండా నగరంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. సోమవారం సరూర్‌నగర్ సర్కిల్ పరిధిలోని ఎస్కే నగర్‌లో అక్రమంగా మోటార్ వినియోగిస్తున్న వ్యక్తికి రూ.5,000 జరిమానా విధించారు. అల్కాపురి యాదవ్ నగర్‌లో తాగునీటితో ఫ్లోర్ శుభ్రం చేస్తున్న మరో వ్యక్తికి రూ.1,000 ఫైన్ వేశారు.

నగరంలో నీటి అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో నీటి వనరులపై ఒత్తిడి పెరుగుతోందని అధికారులు తెలిపారు. ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, మంజీరా, సింగూరు జలాశయాల్లో నీటి మట్టాలు తగ్గడం వంటి పరిస్థితుల నేపథ్యంలో నీటిని పొదుపుగా వినియోగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ప్రజలు అవసరానికి మించి నీటిని వినియోగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జలమండలి సూచించింది. నీటిని వృథా చేయకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరింది. నీటి సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించే క్రమంలో.. వృథా చేసే ప్రతి నీటి చుక్క భవిష్యత్తులో మరొకరి అవసరాన్ని తీర్చగలదని బోర్డు పేర్కొంది.

లీకేజీలపైనా అధికారులకు ఆదేశాలు

మరోవైపు నీటి వృథా విషయంలో వినియోగదారులతో పాటు తమ సిబ్బందిపైనా జలమండలి దృష్టి పెట్టింది. నగరవ్యాప్తంగా ఉన్న సుమారు 15 వేల కిలోమీటర్ల పైప్‌లైన్‌ నెట్‌వర్క్‌లో ఎక్కడైనా లీకేజీకి సంబంధించి ఫిర్యాదు అందితే 24 గంటల్లోగా శాశ్వత పరిష్కారం చూపాలని సిబ్బందిని ఆదేశించింది.

లీకేజీకి తాత్కాలిక మరమ్మతులు చేసి సమస్యను వదిలివేయకుండా పూర్తిస్థాయిలో పరిష్కరించాలని స్పష్టం చేసింది. పదేపదే లీకేజీలు ఏర్పడే ప్రాంతాల్లో శాశ్వత చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కూడా చర్యలు తప్పవని హెచ్చరించింది.

నీటి దుర్వినియోగం లేదా వృథాకు సంబంధించిన ఘటనలు కనిపిస్తే ప్రజలు జలమండలికి ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. ఇందుకోసం 99499 30003 అనే వాట్సాప్ నంబర్‌ను అందుబాటులో ఉంచారు. నగరంలో నీటి కొరతను ఎదుర్కొనేందుకు ప్రజలు, జలమండలి కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని బోర్డు స్పష్టం చేసింది.

also read: ఆర్టీసీ బ‌స్సు బోల్తా…! 20 మందికి గాయాలు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు