హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: హైదరాబాద్ లోని మాదాపూర్ ఓయో హోటల్ రూంలో యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేపింది.. విశాఖపట్నానికి చెందిన షారోన్ నిఖితా టోప్నో తన భాగస్వామి శ్రీనివాస రవి తేజతో కలిసి మాదాపూర్ సిద్ధిఖీ నగర్ రోడ్ నంబర్-5లోని ఓ హోటల్లో బస చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరూ హోటల్లోని 303వ గదిని బుక్ చేసుకుని సోమవారం చెక్ఇన్ చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.మంగళవారం తెల్లవారుజామున యువతి అపస్మారక స్థితిలో ఉన్నట్లు గుర్తించిన రవి తేజ.. హోటల్ సిబ్బంది సహాయంతో ఆమెను కొండాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాడు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆస్పత్రి నుంచి పోలీసులకు సమాచారం అందడంతో మాదాపూర్ పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.యువతి ముఖం, తల భాగంలో తీవ్ర గాయాలు, వాపులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.
Also Read: పోలీసులమని నమ్మించి మైనర్ బాలికపై దారుణం.. ముగ్గురు యువకులపై పోక్సో కేసు
అనంతరం పోలీసులు హోటల్లోని 303వ గదిని పరిశీలించగా గోడలు, బెడ్‌షీట్‌పై రక్తపు మరకలు కనిపించినట్లు సమాచారం. క్లూస్ టీమ్‌ను రంగంలోకి దించిన పోలీసులు గది నుంచి ఫోరెన్సిక్ ఆధారాలను సేకరిస్తున్నారు.ఇదిలా ఉండగా.. యువతి మృతి చెందిన విషయం తెలియగానే ఆమెతో హోటల్‌కు వచ్చిన శ్రీనివాస రవి తేజ ఆస్పత్రి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. అతడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. అతడి ఫోన్ చివరి లొకేషన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో నమోదైనట్లు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. ఆ తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ అయినట్లు సమాచారం.మరోవైపు హోటల్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. యువతికి గాయాలు ఎలా అయ్యాయి? హోటల్ గదిలో ఏం జరిగింది? ఆమె మృతికి అసలు కారణం ఏమిటి? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికలు వచ్చిన తర్వాత మరణానికి గల కారణంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
Also Read:వినాయక చవితి వేడుకల్లో విషాదం.. అన్నదాన కార్యక్రమం రోజు వేడి సాంబారులో పడి మహిళ మృతి
