-షోకాజ్ నోటీసుపై లిఖితపూర్వక వివరణ
-పార్టీ లైన్ దాటి వెళ్లలేదని ప్రస్తావన
-స్థానిక నాయకత్వం ఒంటెద్దు పోకడలపై అంటూ ఆవేదన
-వేటు భయంతోనే వెనక్కి?
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో:-
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిన్నారెడ్డి వెనక్కి తగ్గారా? వేటు తప్పదని భావించి వెనక్కి తగ్గడం మేలన్న నిర్ణయానికి వచ్చారా? ఎన్నికలకు ముందు ఏదో ఒక నిర్ణయం తీసుకోవచ్చని ఆలోచన చేస్తున్నారా? అందుకే కొద్ది రోజులపాటు వేచి చూసి దూకుడు పెంచాలని భావిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వనపర్తి నియోజకవర్గ కాంగ్రెస్లో చిన్నారెడ్డి వ్యాఖ్యలు చిచ్చురేపిన సంగతి తెలిసిందే. స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డిని ఉద్దేశించి చిన్నారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. మొన్నటి ఎన్నికల్లో టికెట్ కొనుక్కున్నారు అంటూ ఆరోపించారు. దీనిపై ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆధారాలతో సహా హై కమాండ్ కు ఫిర్యాదు చేశారు. చిన్నారెడ్డి పై చర్యలు తప్పవన్న ప్రచారం నేపథ్యంలో.. కాస్త వెనక్కి తగ్గుతూ క్రమశిక్షణ కమిటీకి లేఖ రాశారు చిన్నారెడ్డి.
లిఖితపూర్వక వివరణ..
చిన్నారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షాకాజ్ నోటీస్ జారీ చేసింది. లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ తరుణంలో లిఖితపూర్వకంగా చిన్నారెడ్డి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాను పార్టీ లైన్ దాటలేదని స్పష్టం చేశారు. ఎలాంటి తప్పు మాట్లాడలేదన్నారు. పార్టీ జెండా మోస్తున్న క్షేత్రస్థాయి కార్యకర్తల తీవ్ర ఆవేదనను మాత్రమే బాధ్యతాయుతమైన నాయకుడిగా అధిష్టానం దృష్టికి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. ప్రధానంగా వనపర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలను ప్రస్తావించారు. స్థానిక ఎమ్మెల్యే వ్యవహార శైలిని తప్పుపట్టారు. ఏళ్ల తరబడి కాంగ్రెస్ జెండాను మోస్తూ కష్టకాలంలో నిలబడిన అసలైన కార్యకర్తలను, నేతలను పూర్తిగా విస్మరిస్తున్నారని ఆరోపించారు. స్థానిక నాయకత్వం తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాల వల్ల పార్టీ క్యాడర్లో తీవ్ర అసంతృప్తి, నైరాస్యం పేరుకుపోయాయని.. ఒక సీనియర్ నాయకుడిగా వారి బాధను, మనోభావాలను వెలిబుచ్చడం పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడం కిందకు రాదని చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్కు వీర విధేయుడిని..
మరోవైపు తన సుదీర్ఘ రాజకీయ చరిత్రను.. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసిన వైనాన్ని ప్రస్తావించారు. ఏనాడు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని గుర్తు చేశారు.. బహిరంగంగా కానీ.. అంతర్గతంగా కానీ.. పార్టీపై కానీ.. పార్టీ పెద్దలపై కానీ ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని వివరించారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, కేదార్ ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసమే మాట్లాడానని.. తన వ్యాఖ్యలను పార్టీకి వ్యతిరేకంగా చిత్రీకరించడం సమంజసం కాదని స్పష్టం చేశారు. తనకు జారీచేసిన షోకాజ్ నోటీసులు తక్షణమే ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మొత్తానికైతే చిన్నారెడ్డి వెనక్కి తగ్గినట్లే అని కనిపిస్తోంది.
