HomeజాతీయంShashi Tharoor: శశి థరూర్ వ్యాఖ్యలతో కాంగ్రెస్‌లో కలకలం.. జమ్మూ కశ్మీర్‌పై కొత్త చర్చ!

Shashi Tharoor: శశి థరూర్ వ్యాఖ్యలతో కాంగ్రెస్‌లో కలకలం.. జమ్మూ కశ్మీర్‌పై కొత్త చర్చ!

జమ్మూ కశ్మీర్‌లో పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ లోపలే చర్చకు దారితీశాయి. ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకుల నుంచే విమర్శలు రావడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.

కాశ్మీర్ పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు

ఇటీవల జమ్మూ కశ్మీర్ పర్యటనకు వెళ్లిన శశి థరూర్ అక్కడి లెఫ్టినెంట్ గవర్నర్  మనోజ్ సిన్హాను కలిశారు. ఈ భేటీ అనంతరం ఆయన సోషల్ మీడియా వేదిక ఎక్స్‌ లో తన అభిప్రాయాలను పంచుకున్నారు. జమ్మూ కశ్మీర్‌లో పరిస్థితులు మెరుగుపడుతున్నాయని, ప్రజల్లో సానుకూల వాతావరణం కనిపిస్తోందని చెప్పుకొచ్చారు. తాను శ్రీనగర్‌కు చేరుకున్న సమయంలో లెఫ్టినెంట్ గవర్నర్ కశ్మీరీ రచయితలు, మహిళా సంఘాల ప్రతినిధులతో సమావేశమవుతున్నారని థరూర్ చెప్పారు. ఆ ప్రాంతంలో మార్పు దిశగా కొన్ని ప్రోత్సాహకరమైన పరిణామాలు కనిపిస్తున్నాయని, అయితే, ఇంకా అనేక సవాళ్లు మిగిలే ఉన్నాయని కూడా ఆయన స్పష్టం చేశారు. చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నప్పటికీ, చాలా కాలం తర్వాత ఆశాజనక భావనతో సమావేశం ముగించానని ఆయన పేర్కొన్నారు.

థరూర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ విమర్శలు

అయితే, థరూర్ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీకి చెందిన జమ్మూ కశ్మీర్ అధికార ప్రతినిధి రవిందర్ సింగ్ తీవ్రంగా తప్పుబట్టారు. కేవలం అధికారులను కలవడం కాకుండా, కశ్మీర్ లోయలోని సాధారణ ప్రజలను కలిసి వారి అభిప్రాయాలు తెలుసుకుంటే అసలు పరిస్థితులు అర్థమయ్యేవని ఆయన అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.

ఇక మరోవైపు, థరూర్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ మద్దతు తెలిపింది. కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు భిన్నంగా క్షేత్రస్థాయి పరిస్థితులు ఉన్నాయని ఆ పార్టీ అధికార ప్రతినిధి అభిజీత్‌ జస్రోటియా అన్నారు. గత 18 నెలల్లో ఒక్క యువకుడు కూడా ఉగ్రవాద సంస్థల్లో చేరలేదని పేర్కొంటూ, జమ్మూ కశ్మీర్‌లో శాంతి, భద్రత పరిస్థితులు మెరుగుపడుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు