పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. యలమంచిలి మండలం చించినాడ వంతెనపై నుంచి ఓ దంపతులు గోదావరిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ధనసాయికృష్ణ (32), ఆయన భార్య శిరీష (28) మధ్య కుటుంబ సంబంధిత వివాదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. సుమారు రూ.50 వేల విలువైన ఉంగరం విషయంలో తలెత్తిన వివాదమే ఈ ఘటనకు కారణమై ఉండొచ్చని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఉంగరాన్ని తిరిగి ఇచ్చే విషయంలో దంపతులను తీవ్రంగా అవమానించారని, ఆ వేధింపులను తట్టుకోలేకే వారు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. వంతెనపై నుంచి గోదావరిలోకి దూకిన దంపతులను రక్షించేందుకు స్థానికులు ప్రయత్నించారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. అసలు వివాదానికి కారణమేంటి? దంపతులపై ఎలాంటి వేధింపులు జరిగాయి? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెలుగులోకి రావాల్సి ఉంది.
also read: ఆదిలాబాద్‌లో అమానుషం.. నాలుగేళ్ల చిన్నారిపై టీచర్ దాడి
