రాజస్థాన్‌లో పాకిస్థాన్‌కు సమాచారం చేరవేస్తున్నాడనే అనుమానంతో పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనూప్‌గఢ్‌కు చెందిన బల్విందర్ సింగ్ పాక్ హ్యాండ్లర్లతో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. బల్విందర్ సింగ్ డ్రోన్ల ద్వారా పాకిస్థాన్‌కు చెందిన హ్యాండ్లర్లకు సిమ్ కార్డులు చేరవేసినట్లు అనుమానిస్తున్నారు. అంతేకాకుండా భారత మొబైల్ నంబర్లతో వాట్సాప్ ఖాతాలను యాక్టివేట్ చేసి వాటిని పాక్ హ్యాండ్లర్లకు అందించినట్లు దర్యాప్తులో తేలినట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు సరిహద్దు ప్రాంతాల్లో సోలార్ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు కూడా నిందితుడు కుట్ర పన్నినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ చర్యల వెనుక ఉన్న ఉద్దేశ్యం, ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి అనే అంశాలపై అధికారులు దృష్టి సారించారు.
ఇదే సమయంలో బల్విందర్ సింగ్‌కు మాదకద్రవ్యాల అక్రమ రవాణాతోనూ సంబంధాలు ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. పాకిస్థాన్ హ్యాండ్లర్లతో అతడికి ఉన్న పరిచయాలు, సిమ్ కార్డుల సరఫరా, డ్రోన్ల వినియోగం, సరిహద్దు ప్రాంతాల్లో కెమెరాల ఏర్పాటు వంటి అంశాలపై పోలీసులు మరింత లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు.
ఈ కేసులో మరికొందరి ప్రమేయం ఉందా? నిందితుడికి పాక్ హ్యాండ్లర్లతో ఎప్పటి నుంచి సంబంధాలు ఉన్నాయి? సిమ్ కార్డులు, వాట్సాప్ ఖాతాలను ఏ విధంగా ఉపయోగించారు? అనే కోణాల్లోనూ దర్యాప్తు సాగుతోంది. విచారణ పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
also read: నెల్లూరు సెంట్రల్ జైలులో విషాదం.. రిమాండ్ ఖైదీ మృతి
