ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలో ప్రముఖ సింగర్ అంకిత్ దారుణ హత్యకు గురయ్యారు. జిమ్ నుంచి బయటకు వచ్చిన ఆయన తన కారువైపు వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. అంకిత్‌ను చుట్టుముట్టిన దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు సమాచారం.
ఈ దాడి కేవలం కొన్ని సెకన్ల వ్యవధిలోనే జరిగినట్లు తెలుస్తోంది. సుమారు 30 సెకన్లలో నిందితులు 20 రౌండ్ల వరకు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన అంకిత్‌ను స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స పొందుతూ మృతి చెందారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అక్కడ లభించిన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తుల కదలికలు, వారు ఉపయోగించిన వాహనం తదితర వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
హత్యకు గల కారణం ఏమిటన్నది ప్రస్తుతం స్పష్టంగా తెలియలేదు. వ్యక్తిగత కక్షలు, పాత వివాదాలు సహా వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సీసీటీవీ ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్న అధికారులు.. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అంకిత్ హత్యపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.
also read: ఎమ్మెల్సీ మీర్జా రెహ్మత్ బేగ్‌కు బెదిరింపులు.. డీప్‌ఫేక్ వీడియోల పేరుతో డబ్బుల డిమాండ్
